mt_logo

ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్ కాసర్ల రాజును సత్కరించిన మంత్రులు

తెలంగాణ అటవీ కళాశాలలో చదివి తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఘనంగా సత్కరించారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాజును సత్కరించి, ఎఫ్‌సిఆర్‌ఐ తరపున లక్ష రూపాయాల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవులు, పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో పాటు జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను నెలకొల్పారని అన్నారు. అటవీ కళాశాల స్థాపించిన అనతి కాలంలోనే రాజు తన తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించడం అటవీ కళాశాలకు గర్వకారణమన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యాబోధనను అందించేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు, డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బందిని ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్ రాజు మాట్లాడుతూ తనకు తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారని, ఎఫ్‌సిఆర్‌ఐ నుంచి చక్కని ఆదరణ లభించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *