విద్యాశాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలిసి పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతబడదని, పాఠశాలలు మూయకూడదన్నదే ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగిస్తామని, హేతుబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వులు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆరవ నంబర్ ఉత్తర్వులో మార్పులు, చేర్పులు ఉంటాయని చెప్పారు.
రాష్ట్రంలో నకిలీ ధ్రువపత్రాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు, ఇకపై ధృవీకరణ పత్రాలన్నింటినీ ఆన్ లైన్ లో ఉంచుతామన్నారు. వచ్చేనెల 7,8 తేదీల్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, సీపీ మహేందర్ రెడ్డి పాల్గొని నకిలీ ధృవీకరణ పత్రాల వ్యవహారంపై చర్చించారు.