-పథకాల అమలులో దూకుడే
-చేతల సర్కారు..అస్త్రశస్త్రాలతో పథకాల అమలుకు సిద్ధం
-మూడు నెలల్లో అనేక కీలక నిర్ణయాలు
-ఇప్పటికే అమల్లోకి పలు హామీలు
-ఇక.. కేసీఆర్ మార్క్ పాలన ప్రారంభం
వంద రోజుల్లో చేసిందేమీలేదు. ఇప్పుడే మొదలుబెట్టినం. సమగ్ర సర్వేతో సమాచారమంతా తీసుకున్నం. ఇగ మైలపోలు తీస్తం. దసరా నుంచి సంక్షేమ పథకాలు అమలుచేస్తం.. ఇదీ తన వందరోజుల పాలన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుక సాక్షిగా చెప్పినమాట! ఇప్పుడు ఆ మాటలు కార్యాచరణ రూపం సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చుతున్న టీఆర్‌ఎస్ సర్కార్.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కీలక సంక్షేమ పథకాల అమలును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన తెలంగాణ.. ఇప్పుడు జమ్మిచెట్టుపై నుంచి అస్త్రాలను దించుతున్నది.
తమను ఇన్నాళ్లూ వేధించిన సమస్యలపై సమరానికి సిద్ధమవుతున్నది. ఒకనాటి తన వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని తిరిగి పొందేందుకు సమాయత్తమవుతున్నది. గత పాలకులు చేసిన తప్పిదాలను ఒక్కొక్కటీ సరిదిద్దుకుంటూ.. సరైన దృక్ఫథం, పకడ్బందీ ప్రణాళిక.. భావి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా దూరదృష్టితో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. సరైన ప్రణాళిక తయారు చేసుకుంటే సగం పని పూర్తయినట్లేనని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. సమరానికి వెళ్లే ముందు కీలకమైన ఆయుధాలకు పదునుపెట్టారు. ఇప్పుడు అవే ఆయుధాలను ఉపయోగించి.. తెలంగాణ పాలిట సమస్యలను, అరవై ఏండ్ల చీకటిని పారదోలేందుకు రంగం సిద్ధం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంలో నలిగిపోయిన తెలంగాణకు అనేకరంగాల్లో తీవ్రస్థాయిలో అన్యాయాలు జరిగాయి. అవే నినాదాలుగా తెలంగాణ ఉద్యమం మొదలై.. ఎట్టకేలకు విజయం సాధించింది. తెలంగాణ యాచించే దశ నుంచి శాసించే స్థాయికి చేరుకున్నది. ఇక ఇప్పుడే అసలైన దశకు కీలక అడుగు పడుతున్నది. భావి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే క్రమంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు పక్కా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వ్యవస్థల్లోకి ప్రజలందరినీ భాగస్వాములను చేసుకుంటూ ప్రభుత్వం ప్రస్థానం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ.. వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధంచేసింది.
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు లక్షలోపు రుణాలను మాఫీచేసింది. తెలంగాణ సాధన సమరంలో పాలుపంచుకున్న ఉద్యోగుల ఉద్యమస్ఫూర్తిని గౌరవిస్తూ వారికి ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ అందజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో సోదిలోలేకుండా పోయిన తెలంగాణ సంస్కృతికి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు బతుకమ్మ, బోనాల పండుగలకు రాష్ట్ర అధికార పండుగల గుర్తింపునిచ్చి.. ఘనంగా నిర్వహిస్తున్నది. సీమాంధ్ర పాలకుల వివక్షతో వెలుగులోకి రాలేకపోయిన తెలంగాణ వైతాళికులకు పెద్దపీట వేసి.. వారి స్ఫూర్తిని ప్రజలకు చేరువ చేస్తున్నది.
కాళోజీ కళాకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. ఆచార్య జయశంకర్ పేరిట వ్యవసాయ వర్సిటీని ఏర్పాటు చేసినా.. పీవీ నర్సింహారావు పేరును వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టినా.. ఇదంతా ఒకప్పుడు తెలంగాణ కోల్పోయిన ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడమే! వివిధ ప్రభుత్వ సంస్థలకు కోట్ల రూపాయల నిధులు కేటాయించినా.. దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినా.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను విశ్వస్థాయికి తీసుకెళ్లేందుకు పోలీసింగ్ సహా వివిధ కార్యక్రమాలు చేపట్టినా.. ఎవరెస్టునెక్కిన తెలంగాణ బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరొక పాతిక లక్షలు అందించినా.. విశ్వస్థాయి ఆటల్లో అగ్రస్థానంలో నిలిచే తెలంగాణ క్రీడారులకు కోటి రూపాయలు నజరానా ప్రకటించినా.. రాష్ట్ర ప్రజలందరినీ ఒక రోజు ఇండ్ల వద్దే ఉంచి.. సమగ్ర కుటుంబ సర్వేను దిగ్విజయం చేసినా.. మూసపద్ధతులకు స్వస్తి పలికి.. బడ్జెట్ రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినా.. తెలంగాణ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే గోల్కొండ కోటలో పంద్రాగస్టునాడు త్రివర్ణ పతాకం ఎగరేసినా.. అంతా కేసీఆర్ మార్క్ పాలనకు ఆరంభం మాత్రమే! ఇక అసలు సిసలైన పాలన దసరా నుంచి మొదలుకాబోతున్నది.
ఒకప్పుడు తెలంగాణ మాగాణం సిరుల పంటలు పండించిందంటే ఈ ప్రాంతంలో తరతరాలుగా కొనసాగిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువుల నిర్వహణే అందుకు కారణం. అలాంటి అద్భుతమైన నీటి సరఫరా వ్యవస్థను సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యంతో నలిపేశారు. చెరువు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. పట్టించుకునేవారులేక అనేకం పూడుకుపోయాయి. ఇప్పుడు ఆ గత వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు సంకల్పించిన ప్రభుత్వం.. చెరువుల పునరుద్ధరణను పండుగలా చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. మంచినీటికి నోచుకోని తెలంగాణ పల్లెల దప్పిక తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు కానున్నది. తెలంగాణ దళిత, గిరిజన ఆడపడుచుల పెండ్లి మంటపాలు కళకళలాడేందుకు కల్యాణలక్ష్మి వారి చెంతకు నడిచిరానున్నది. మైనార్టీ యువతులకు షాదీ ముబారక్ చెప్పనుంది. ముష్టివేసినట్లు ఇప్పటిదాకా ఇచ్చిన వృద్ధాప్య, వితంతు పెన్షన్లను సర్కారు పెంచుతున్నది. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సింగిల్ విండో అనుమతులు ప్రధానాంశంగా కొత్త పారిశ్రామిక విధానం తుదిమెరుగులు దిద్దుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నది.
ఇప్పటివరకు అమలులోకి వచ్చినవి.. రాబోతున్నవి..
-రాష్ట్రంలోని 36 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రూ.17వేల కోట్ల మేర రుణ మాఫీని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా ప్రభుత్వం రూ.4,250 కోట్లను మంజూరు చేసింది.
-తెలంగాణ జిల్లాల్లో 2009 నుంచి 2014 వరకు వచ్చిన భారీ వర్షాలు, తుఫాన్లు, వడగండ్ల వానలతో కుదేలైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.480 కోట్లను విడుదల చేసింది.
-నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులకు రావాల్సిన రూ.11.5 కోట్ల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించింది.
-హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేసే ఉద్దేశంతో ఆ శాఖ ఆధునీకరణకు ఒకేసారి రూ.350 కోట్లను విడుదల చేసింది.
-తెలంగాణ పిల్లలు ఆర్థిక స్థోమత లేని కారణంగా మంచి చదువులకు దూరం కావద్దనే సదుద్దేశంతో ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పథకం ప్రారంభించింది.
-లిక్కర్ మాఫియాకు తలొగ్గి గత ప్రభుత్వాలు హైదరాబాద్‌లో నిషేధించిన కల్లు దుకాణాలను తెరిపించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 60వేల మంది కల్లుగీత కార్మికులకు ఉపాధి లభించనుంది.
-1969నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో విలువైన ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పది జిల్లాల్లోని తొలి విడతగా 462 కుటుంబాలకు తలా రూ.పది లక్షల ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు రానున్నాయి.
-తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాడిన ఉద్యమకారులపై సమైక్య సర్కారు కర్కశంగా బనాయించిన వందల కేసులను ఎత్తేయబోతున్నది.
మహనీయులకు ప్రాధాన్యం…
సీమాంధ్ర పాలకులు విస్మరించిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సముచిత స్థానం ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. గత జూన్ 28న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టింది. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. వరంగల్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పద్యాన్ని పదునైన ఆయుధంగా మార్చుకొని తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన దాశరథి కృష్ణమాచారి జయంతిని ప్రభుత్వం జులై 22న అధికారకంగా ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టింది.
తెలంగాణలో ఏర్పడనున్న కొత్త జిల్లాల్లో ఒక దానికి జయశంకర్ పేరు పెట్టేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు వచ్చిన వైద్య విశ్వ విద్యాలయాన్ని వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. దానికి కాళోజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా నామకరణం చేసింది. అంతకు ముందే వరంగల్‌లో కాళోజీ పేరిట సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. తెలంగాణలో పలు జలాశయాల నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ జయంతిని జులై 11న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మొదటిసారిగా ఆయన జన్మదినాన్ని ఇంజినీర్స్‌డే జరుపుకోవడంతో పాటు హైదరాబాద్‌లో విగ్రహాన్ని కూడా ప్రతిష్టించింది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..