-పోలింగ్ సిబ్బంది ఇచ్చే స్కెచ్‌పెన్‌నే వాడాలి
-ప్రథమ ప్రాధాన్య ఓటు తప్పనిసరి
-అంకెల్లోనే ప్రాథమ్యాలు గుర్తించాలి
-బ్యాలెట్‌పై ఇతర ఏ రాతలూ రాయరాదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు ఈ నెల 22న ఎన్నికలు జరుగబోతున్నాయి. హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఒక పట్టభద్రుల స్థానానికి, ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాలకు సంబంధించి మరో పట్టభద్రుల స్థానానికి అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికలు ఏవైనా ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో పాల్గొనేది సాధారణ ప్రజలు కాదు.. విద్యావంతులైన.. విషయపరిజ్ఞానం ఉన్న పట్టభద్రులు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ సాధారణ ఎన్నికలతో పోల్చితే విలక్షణంగా ఉంటుంది. దీనిని ప్రాధాన్య ఓటింగ్ (ప్రిఫరెన్షియల్ ఓటింగ్) అని పిలుస్తారు. సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు అయితే నచ్చిన అభ్యర్థి పేరు పక్కన బటన్ నొక్కుతాం. బ్యాలెట్‌పేపర్‌తో జరిగినట్లయితే అభ్యర్థి ఎన్నికల గుర్తుపై ముద్ర వేస్తాం. కానీ.. మండలి ఎన్నికల్లో మాత్రం ఈ పద్ధతి ఉండదు. ఇక్కడ మనకు నచ్చిన అభ్యర్థిని ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలి. రెండో ప్రాధాన్య ఓటు.. మూడో ప్రాధాన్య ఓటు.. ఇలా చివరి అభ్యర్థి దాకా ప్రాధాన్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత తదుపరి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తంగా ఈ ప్రక్రియ మామూలు ఓటింగ్‌కంటే భిన్నమైన పద్ధతిలో ఉంటుంది. విద్యావంతుల ఓటు స్వల్ప గందరగోళంతో వృథా కాకూడదని ఓటర్లకు ఈ విషయంలో మరింత అవగాహన కల్పించే ప్రయత్నమే ఇది.
పాటించాల్సినవి:
-ఓటరు స్లిప్, తగిన గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవాలి.
-క్యూలో మన వంతు వచ్చినప్పుడు బ్యాలెట్ పేపరుతో పాటు ఇచ్చే వంకాయ రంగు (వయొలెట్) స్కెచ్ పెన్ ఉపయోగించి ఓటు వేయాలి. అంతేకానీ.. ఇతర ఏ పెన్ను లేదా పెన్సిల్ ఉపయోగించరాదు. ఓటు వేసేందుకు స్కెచ్ పెన్‌ను పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బందే ఇస్తారు.
-బ్యాలెట్ పేపర్‌లో ఉన్న పేర్లకు ముందు ఓటర్లు తమ ప్రాధాన్య ఓటు ఏమిటనేది తెలపాల్సి ఉంటుంది. ఓటరు… అభ్యర్థుల్లో ఎవరికి మొదటి ప్రాధాన్య ఓటు ఇవ్వాలనుకుంటారో ఆ అభ్యర్థి పేరు ముందు 1 అనే అంకె వేయాలి. ముఖ్యంగా ఆ పేరుకు ముందు మాత్రమే అంకె వేయాలిగానీ… పైన, కింద ఉన్న లైన్లకు తగలకుండా జాగ్రత్త పడాలి.
-ఆ తర్వాత మీకు నచ్చిన ఇతర అభ్యర్థులు ఎంతమంది ఉంటే అంతమందికీ తదుపరి ప్రాధాన్య ఓటింగ్ కింద 2, 3, 4, ఇలా అంకెలు వేయొచ్చు.
-మొదటి ప్రాధాన్య ఓటు వేసిన తర్వాత మిగిలిన ప్రాధాన్య ఓట్లు (2, 3, 4)
-తప్పనిసరిగా వేయాలనే నిబంధన ఏదీ లేదు.
-ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్య ఓట్లు ఇవ్వకూడదు.
-బ్యాలెట్ పేపర్‌లోని ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటా (ణోటా) బాక్సుకు ఎదురుగా రైట్ మార్కు (3) లేదా క్రాస్ మార్కు (5) వేయాలి.
చేయకూడనివి:
-బ్యాలెట్ పత్రంలో మొదటి ప్రాధాన్య ఓటు ఒకరికి వేసిన తర్వాత మరొకరికి కూడా మొదటి ప్రాధాన్య ఓటు వేయకూడదు. ఉదాహరణకు ఎక్స్‌వైజెడ్ అనే వ్యక్తికి మీరు మొదటి ప్రాధాన్య ఓటు వేస్తూ ఆయన పేరు పక్కన 1 అంకె వేస్తే.. మిగిలిన అభ్యర్థులకు 2, 3, 4 ఇలా ఇతర అంకెలు వేయాలి.
-బ్యాలెట్ పత్రంపై అభ్యర్థి పేరు పక్కన రైట్ మార్కు (3) లేదా రాంగ్ మార్కు (5) వేయకూడదు, అలాగే ఎలాంటి చేతి రాతలు లేదా వేలి ముద్రలు వేయకూడదు.
-అభ్యర్థులకు ప్రాధాన్య ఓటును అంకెల రూపంలో మాత్రమే వేయాలి. ఉదాహరణకు 1, 2, 3.. అంతేకానీ.. అంకెలను అక్షరాల్లో ఒకటి.. రెండు.. మూడు అని రాయకూడదు.
-మీరు వేసే అంకె అభ్యర్థి పేరు పక్కన ఉన్న బాక్సులో మాత్రమే ఉండాలి. అటుఇటుగా వేసినట్లయితే ఓటు చెల్లదు.
-మీరు నోటా ఆప్షన్ ఎంచుకున్నట్లయితే.. అక్కడ మార్కు చేసిన తర్వాత ఇక ఏ అభ్యర్థికీ ప్రాధాన్య ఓట్లు వేయకూడదు.
చెల్లని ఓట్లు ఇవే..
-1 అనే అంకె వేయకుంటే..
-1 అనే అంకెను ఒక్క అభ్యర్థి కాకుండా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల పేర్ల ముందు సూచిస్తే..
-1 అనే అంకెను ఇద్దరి పేర్ల మధ్య గీతపై సూచించినా. (ఎవరి పేరు ముందు ఇచ్చారనేది సందేహంగా)
-1 అనే అంకెను ఒక అభ్యర్థికి సూచించి… అదే అభ్యర్థి పేరు ముందు 2, 3.. అని సూచించడం..
-ప్రాథమ్యాలను అంకెల్లో కాకుండా పదాల్లో సూచించడం..
-రిటర్నింగ్ అధికారి ఇచ్చిన వంకాయ రంగు స్కెచ్‌పెన్‌తో కాకుండా ఇతరత్రా వాటితో ప్రాథమ్యాలను గుర్తించినపుడు…
-ఎలాంటి ప్రాథమ్యాలను సూచించకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇచ్చినపుడు…
-బ్యాలెట్ పేపర్‌పై ఇతరత్రా సంకేతాలు, పదాలు, ఇతరత్రా రాయడం చేస్తే…
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..