మన్మథ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 28 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదించారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 10, 116 తో ఉగాది పర్వదినాన ప్రభుత్వం సత్కరించనుంది.
సాహిత్యరంగంలో గోరటి వెంకన్న, ముదిగంటి సుజాతారెడ్డి, కరీంనగర్ కు చెందిన మలయశ్రీ, నృత్యంలో వరంగల్ జిల్లాకు చెందిన సుధీర్ రావు, రత్నశ్రీ, సంగీతంలో రామలక్ష్మి రంగాచారి, రాజగోపాలాచారి, నాటకరంగంలో అమరేందర్, చిత్రకళలో సూర్యప్రకాష్, అంజనీరెడ్డి, జానపద సంగీతంలో వడ్డేపల్లి శ్రీనివాస్, జానపద కళారూప ప్రదర్శనలో పన్నెండు మెట్ల కిన్నెర శ్రీదర్శనం మొగులయ్య, పేరిణి నృత్యంలో పేరిణి రమేష్, శిల్పకళలో శ్రీనివాస రెడ్డి, సిరిసిల్లకు చెందిన పాండు, టీవీ రంగం నుండి నాగబాల సురేష్, సినిమారంగం నుండి ఎన్ శంకర్, భూపాల్ రెడ్డి, జానపద చిత్రకళ నుండి చేర్యాలకు చెందిన నకాష్ వైకుంఠం, హస్తకళారంగంలో సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్, హుజూరమ్మ, వేదపరిశోధనలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంవీ నర్సింహారెడ్డి, కళాశ్రమం నుండి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాశ్రమం రవీంద్ర శర్మ, బుర్రకథలో ఖమ్మం జిల్లాకు చెందిన బీ సరోజిని, హరికథలో పద్మాలయాచార్య, ఒగ్గుకథలో ఒగ్గు ధర్మయ్య, చిందు యక్షగానంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన చిందు పెదబాబయ్య, మిమిక్రీలో ఆర్ సదాశివ తదితరులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.