ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించాయి. బుధవారం ఉదయం సభ తిరిగి ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో హైకోర్టు విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన లోక్ సభలో కూడా ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు.
అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకు హైకోర్టు విభజనపై తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పిన సీఎం తీర్మానంలోని అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు బలపరిచాయి. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, సీఎం ప్రవేశపెట్టిన హైకోర్టు విభజన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు, హైకోర్టు విభజనతో పాటు హైదరాబాద్ లో అందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే అంశాన్ని కూడా తీర్మానం కాపీలో చేర్చాలని సూచించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ విభజన తీర్మానానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు, ఇటీవల జ్యుడీషియల్ లో కొత్త పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, హైకోర్టు విభజన పూర్తయ్యేవరకు ఎలాంటి జ్యుడీషియల్ పోస్టుల భర్తీ చేపట్టరాదని సూచించారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జానారెడ్డి, కిషన్ రెడ్డి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, అయితే విపక్షాలు ఇచ్చిన సూచనలను తీర్మానంలో చేర్చడం సాంకేతికంగా సాధ్యం కాదని, అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకు హైకోర్టు విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసే లేఖలో స్పష్టంగా ఈ అంశాలను పొందుపరుస్తామని హామీ ఇచ్చారు.హైకోర్టు విభజనపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయశాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి సదానందగౌడను కలిసి హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం సమావేశమై ఉభయసభల్లో హైకోర్టు విభజన తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని తెలిపారు. ప్రత్యేక హైకోర్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు, విభజన విషయంలో సహకరించాలని కేసీఆర్ చీఫ్ జస్టిస్ కు విజ్ఞప్తి చేశారు.