తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ హాజరవగా… గురువారం నాటికి ఆ సదస్సు ముగిసింది. శుక్రవారం కూడా స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ సమావేశ అనంతరం తన దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లుగా ప్రకటించారు. యూకే, దావోస్ పర్యటనలో భాగంగా 45 వాణిజ్య, 4 రౌండ్ టేబుల్, 4 ప్యానెల్ సమావేశాల్లో పాల్గొనగా… ఈ పర్యటన వల్ల తెలంగాణకి రూ.4,200 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించారు. యూకే, దావోస్ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రపంచ వేదిక పైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.