mt_logo

ఉమ్మడి పాలమూరు లోని ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు : మంత్రి కేటీఆర్

సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ… ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని ప్రాజెక్టుల‌కు, చెరువుల అభివృద్ధి కోసం అలాగే క‌ల్వ‌కుర్తి, నెట్టెంపాడు, బీమా, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో పాటు ఉమ్మ‌డి జిల్లాలోని చెరువుల‌ను నింప‌డానికి రూ.28 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టామని.. దీంతో 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు అద‌నంగా నీళ్లు వ‌చ్చాయ‌ని కేటీఆర్ తెలిపారు.

పాల‌మూరు ప‌చ్చ‌బ‌డుతుంటే కొంద‌రికి మ‌న‌సున ప‌డుత‌లేదని కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ 28 వేల కోట్ల‌లో 28 పైస‌లైనా మోదీ ప్ర‌భుత్వం ఇచ్చిందా అంటే గుండు సున్నా. సిగ్గులేకుండా పాయద‌యాత్ర‌లు చేస్తున్నారు. వికారాబాద్ నుంచి నారాయ‌ణ‌పేట మీదుగా క‌ర్ణాట‌క‌లోని కృష్ణాకు రైల్వే లైన్, గ‌ద్వాల నుంచి మాచ‌ర్ల వ‌ర‌కు రైల్వే లైన్ అడుగుతున్నారు. ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. అమిత్ షా చిత్త‌శుద్ధి ఉంటే పాల‌మూరుకు జాతీయ హోదా ప్ర‌క‌టించు. నారాయ‌ణ‌పేట‌, గ‌ద్వాల – మాచ‌ర్ల రైల్వే లైన్ ప్ర‌క‌టించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే న‌వోదయ పాఠ‌శాల పెట్టాల‌ని అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగంలో ఉంద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. మోదీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక కొత్త‌గా 84 కొత్త న‌వోద‌యాలు ఇస్తే మ‌న‌కు గుండు సున్నా. దేశ వ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణ‌కు మాత్రం గుండు సున్నా. 16 ట్రిపుల్ ఐటీలు మంజూరు చేస్తే మ‌న‌కు గుండు సున్నా. కొత్త 7 ఐఏఎంలు మంజూరు చేస్తే మ‌న‌కు గుండు సున్నా. జాతీయ విద్యా సంస్థ‌ల‌ను తెలంగాణ‌కు మంజూరు చేయ‌లేదు కానీ, ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతూ కులం, మ‌త పేరు మీద రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

మోదీ ప్ర‌భుత్వం కొత్త దుకాణం తెరిచిందని కేటీఆర్ విమ‌ర్శించారు. మ‌నం 24 గంట‌ల క‌రెంట్ ఉచితంగా ఇవ్వ‌డం కేంద్రానికి న‌చ్చ‌డం లేదు. మీరు ఫ్రీ క‌రెంట్ ఇవ్వొద్దని ఆదేశిస్తున్నారు. రైతు మోటార్ వ‌ద్ద మీట‌ర్ పెట్టాల‌ని మోదీ విద్యుత్ చ‌ట్టం తీసుకొచ్చిండు. మీట‌ర్లు పెట్ట‌క‌పోతే డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని మోదీ అంటున్న‌డు. అప్పులు ఇవ్వ‌మ‌ని బెదిరిస్తున్నారు. రాబోయే ఐదేండ్ల‌లో తెలంగాణ‌కు న్యాయంగా రావాల్సిన రూ.25 వేల కోట్ల‌లో పైసా ఇవ్వ‌న‌ని మోదీ అంటున్న‌డు. నేను బ‌తికున్నంత కాలం నా రైతు మోటార్ వ‌ద్ద మీట‌ర్ పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం రూ. 25 వేల కోట్లు ఇచ్చిన ఇవ్వ‌క‌పోయినా వ్య‌వ‌సాయానికి ఫ్రీ క‌రెంట్ ఇస్తామ‌ని సీఎం తేల్చిచెప్పార‌ని కేటీఆర్ తెలిపారు.

వీరు అజ్ఞానులు.. ఏం తెల్వ‌దు. సిగ్గులేని మ‌న‌షులు అని బీజేపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. నేత కార్మికుల వ‌ద్ద‌కు వెళ్లి మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారని మండిప‌డ్డారు. చేనేత మీద జీఎస్టీ ప‌న్ను విధించిన ఏకైక ప్ర‌ధాని మోదీనే అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా చేనేత స‌మూహాలు మంజూరు చేయ‌గా, నారాయ‌ణ‌పేట‌కు, కొత్త‌కోట‌కు, గ‌ద్వాల‌కు ఒక్క చేనేత స‌మూహం మంజూరు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ నాయ‌కులు అబ‌ద్ధాలు చెప్పి బ‌తుకుతున్నార‌ని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ఏ ఊరికి పోయినా చెట్లు, న‌ల్లా క‌నెక్ష‌న్లు క‌న‌బ‌డుతున్నాయి. ఆస‌రా పెన్ష‌న్లు అందుకుంటున్న అవ్వ‌లు క‌న‌బ‌డ్డారు.. రైతు వేదిక‌లు, వైకుంఠ‌ధామాలు, డంప్ యార్డులు క‌న‌బడుతున్నాయి.. ఈ ప‌థ‌కాల‌న్నింటిలో మా పైస‌లు ఉన్నాయ‌ని ఆయ‌న అంటున్నాడు. మ‌రి కేంద్రం పైస‌లే మ‌న ప‌థ‌కాల్లో ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప‌థ‌కాలు అమ‌లు కావాలి క‌దా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. క‌ర్ణాట‌క‌లోని రాయిచూర్‌లోకి పోదాం.. మీరు చెప్పే మాట‌ల్లో నిజాయితీ ఉంటే.. మా ప‌థ‌కాల‌న్నీ అక్క‌డ చూపిస్తావా? ధైర్యం ఉందా? అని కేటీఆర్ స‌వాల్ చేశారు. ఉత్త‌మ గ్రామ‌పంచాయ‌తీలుగా మ‌న‌వే టాప్ టెన్‌లో ఉన్నాయి. మ‌రి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్త‌మ గ్రామాలు ఎందుకు ఎంపిక కావ‌డం లేదు. గ‌ట్టిగా నిల‌దీస్తే హిందూ ముస్లిం, భార‌త్, పాకిస్తాన్ అంట‌రు. నేను చెప్పెదాంట్లో ఒక్కటంటే ఒక్క అక్ష‌రం త‌ప్పు ఉన్నా ఏ శిక్ష‌కైనా సిద్ధం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *