mt_logo

పేదల్లో ముఖాల్లో చిరునవ్వును కోరే ప్రభుత్వం మాది : మంత్రి కేటీఆర్

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మన నగరం బహిరంగసభకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించి ఇండ్లు నిర్మించుకున్నాక నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువులు ఎలా? అని గోడు వెళ్లబోసుకున్నప్పటికీ గత పాలకులు కనికరం చూపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 118 జీవోతో ఎల్బీనగర్‌ నియోజకవర్గంతోపాటు రాజేంద్ర నగర్‌, మేడ్చల్‌, కార్వాన్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వెయ్యి గజాల వరకు ఉండే ప్రతి నిర్మాణాన్ని రెగ్యులరైజ్‌ చేస్తున్నామని, గజానికి రూ.250 నామమాత్రపు రుసుముతో రెగ్యులరైజ్‌ చేసుకోవచ్చన్నారు. వంద గజాలు ఉంటే రూ.25వేలు, 200 గజాలు ఉంటే రూ.50వేలు, 400 గజాలు ఉంటే రూ.లక్ష చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే చేతికి పట్టాను అందజేస్తామని చెప్పారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఇంకా మిగిలిపోయిన ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సభావేదికపైనే జీవో 118 కాపీని మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి అందజేసి లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపారు. 

ఇన్నేండ్లలో తెలంగాణ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసింది తప్పితే నష్టం చేయలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోరుకునే సర్కార్‌ మాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పొచ్చని, ఎల్బీనగర్‌ చౌరస్తా ఎనిమిదేండ్ల కింద ఎలా ఉండేది? ఇప్పుడు ఎట్లా అయ్యిందో చూస్తే అర్థమవుతుందన్నారు. ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే రూ.1200 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లను నిర్మించామని, రూ.450 కోట్లతో తాగునీరందించామని, ఎస్‌ఎన్‌డీపీ కింద నాలాల కోసం రూ.113 కోట్లను కేటాయించామని చెప్పారు. రాజేంద్రనగర్‌ యూనివర్శిటీ పరిధిలోని భూసమస్యలను కూడా పరిష్కరిస్తామని, గురుద్వార్‌ కోసం సిక్కులకు స్థలం కేటాయించే బాధ్యత నాది అని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

కాగా మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరైన మన నగరం కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు కోటి ఆశలతో సభకు హాజరయ్యారు.ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని కాలనీలతో పాటుగా మేడ్చల్‌ నియోజకవర్గం పీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెండు కాలనీలు, రాజేంద్రనగర్‌లోని సిక్‌ చావునీ ప్రాంత వాసులు, నాంపల్లి నియోజకవర్గంలోని కొన్ని కాలనీల వాసులకు ఈ జీవో 118తో మేలు జరగనుండటంతో భారీగా తరలివచ్చారు. వారి అంచనాలకు అక్షరరూపం ఇస్తూ మంత్రి కేటీఆర్‌ జీవో 118 కాపీని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి అందజేయడంతో ఆయా కాలనీవాసులు హర్షాతీరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. సభా వేదికపై కాలనీల పేర్లను చదవడంతో పాటుగా కొన్ని కాలనీల పేర్లు మిస్‌ అయినా వాటికి కూడా పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్‌ చెప్పడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. జై కేసీఆర్‌, జై కేటీఆర్‌ నినాదాలతో సభా ప్రాంగణమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ లు, నగర మేయర్, కార్పోరేటర్లతోపాటు పలువురు అధికారులు మరియు పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *