హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని మాత్రమే కాదని, భారతదేశానికే ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ భారతవాణికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్యనగరంలో కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏదంటే హైదరాబాద్ అని తెలిపారు. 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తుందంటే అతిశయోక్తి కాదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఎయిర్ ట్రాఫిక్‌లో నాలుగో స్థానానికి చేరుకుందని… ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత మనమే ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. మిగతా ఏ నగరాలకు లేని భౌగోళిక, పర్యావరణ అనుకూలతలు హైదరాబాద్‌కు ఉన్నాయి. నాలుగు వైపులా నగరం పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారతదేశంలోని ఇతర మహానగరాల్లో రకరకాల కారణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చే దుస్థితి ఒక నగరంలో ఉందని, మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, ఇంకో నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇలా అనేక సమస్యలతో దేశంలో నగరాలు సతమతమవుతున్నాయి కానీ హైదరాబాద్‌కు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి దార్శనికత ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఏడేండ్లలో ఎన్నో సమస్యలను పరిష్కారం అయ్యాయని కేటీఆర్ తెలిపారు.