mt_logo

మహిళా విజయ గాథలు రాసి స్ఫూర్తి నింపండి : మంత్రి కేటీఆర్

తెలంగాణా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉందని, ప్రధానంగా మహిళా, శిశు సంక్షేమంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో వివిధ పత్రికా, ప్రసారమాధ్యమాల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతీ రాథోడ్ లు అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ ఎనిమిదేళ్లలో మహిళాభ్యుదయం, శిశు సంక్షేమ రంగంలో గణనీయమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా శిశు మరణాలు, నియో నాటల్ మరణాలు, మెటర్నల్ మరణాలు గణనీయంగా తగ్గాయని, దీనికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విజయాలకు సాక్ష్యమని తెలియచేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందచేశామని, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాలతో రాష్ట్రంలో ఆసుపత్రులలో ప్రసవాలసంఖ్య పెరిగిందని అన్నారు. ఒక్క, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లోనే నెలకు 300 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయని ఉదహరించారు. రాష్ట్రంలో 17 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందచేశామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 300 అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

పాశాత్య దేశాలతో పోల్చితే మన దేశంలోని మహిళలు బహుముఖ విధులను నిర్వహిస్తారని, ముఖ్యంగా మీడియా రంగంలోని మహిళలు మరింత కఠినతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క రంగంలోని వారు తమసేవలకు గుర్తింపు కోరుకుంటారని, ఈ క్రమంలోనే వీరి సేవలకు గుర్తింపుగా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి చిరు సత్కారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలతో అబివృద్ది, సంక్షేమ రంగంలో వచ్చిన మార్పులను ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తా కథనాలను రాయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో 18000 పోలీసు ఉద్యోగాల నియామకం జరిగితే దానిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని, విధ్యుత్ శాఖలో 9644 ఉద్యోగ నియామకాలు జరిగితే దీనిలోనూ 50 శాతం మహిళలే ఉన్నారని వెల్లడించారు. కేవలం మగవాళ్ళు మాత్రమే చేస్తారనే పేరున్న లైన్ మెన్ ఉద్యోగాలలోనూ 217 మహిళలను నియమించామని, ఇలాంటి వాటిపై విజయ గాధలపై ప్రత్యేక కధనాలు రాసి మహిళలకు స్ఫూర్తి నింపాలని జర్నలిస్టులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *