‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని, కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని త్యాగపూరితమైందని అన్నారు. అన్నీతానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే వొక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని, దార్శనికతను మానవీయ కోణాన్ని… తన పాలనలో అన్వయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మానవ జాతికి మహిళ వొక వరమని, మహిళాభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని అన్నారు.
దళిత, బడుగు బలహీన వెనకబడిన వర్గాలు, రైతుల ఆత్మబంధువుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని సీఎం అన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం చిత్తశుద్దితో పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మహిళా బంధు’గా ఆదరణ పొందుతుండడం తనకెతంతో సంతోషం కలిగిస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు 10 లక్షల మంది ఆడపిల్లల పెండ్లికి కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా తనవంతుగా ఆర్థికంగా ఆదుకుంటూ, 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించి ఆర్థింకంగా ఆలంబననిస్తూ, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, వంటి పథకాలతో పాటు, వితంతువులు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలా నెలా సకాలంలో పెన్షన్లు అందచేస్తూ, షీ టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తూ.. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచడంతో పాటు ఇంకా అనేక పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, ‘మహిళా బంధు’ గా మహిళాలోకం చేత ఆదరణ పొందుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళాభ్యుద కార్యాచరణ, మహిళకు ఆర్థిక సామాజిక సమానత్వంతో పాటు తెలంగాణ రాష్ట్రం లో స్త్రీ, పురుష నిష్పత్తిలో సమానత్వం దిశగా మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిందన్నారు. మహిళకు సామాజిక ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను కట్టబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించిందన్నారు. తద్వారా మహిళను తెలంగాణ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించుకుంటున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.