mt_logo

బేగంపేటలో 61 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో 61 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రోడ్ లో ప్యాట్నీ నాలాపై 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోట బావి, బ్రాహ్మణ వాడిలలో ప్రారంభించారు. పాటిగడ్డలో స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రభుత్వ పథకాల అమలులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికంటే ముందుంటారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది ముందుగా సనత్ నగర్ నియోజకవర్గంలోనే అమలు అవుతుందని, ఇది శ్రీనివాస్ యాదవ్ కు నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్న పట్టుదలకు నిదర్శనంగా పేర్కొన్నారు. నిరుపేదలు శుభకార్యాల నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాటిగడ్డ ప్రాంతంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఆర్&బీ శాఖకు చెందిన 1200 గజాల స్థలాన్ని జిహెచ్ఎంసీకి బదలాయించి 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నట్లు వివరించారు. నామమాత్రపు ధరపై ఈ ఫంక్షన్ హాల్ ను అద్దెకు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, తదితర నాయకులు, అధికారులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *