mt_logo

‘మన ఊరు-మన బడి’కి ఎన్నారైలు చేయూతనివ్వండి : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎన్నారైలకు కేటీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో తనదైన మార్కును చాటుతూ అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ మేరకు భారీ ప్రాజెక్టులతో మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ విప్లవాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని కేటీఆర్ తెలిపారు. విద్యా రంగంలో కూడా అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని, వాటికి సంబంధించిన ఫలాలు అందుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, వాటి ద్వారా విద్యార్థులు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నూతన విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సైతం బలోపేతం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 7289 కోట్ల రూపాయలతో, దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని ఈ విషయంలో కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అందరూ ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే కోటి రూపాయలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే వారు సూచించిన పేరును ఆ పాఠశాలకు పెడతామని లేదా పది లక్షల రూపాయలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే ఆయా క్లాస్ రూమ్ కి వారు సూచించిన పేరు పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దీంతోపాటు తమకు తోచినంత మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముందుకు వచ్చే వారందరికీ కూడా ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిన తద్వారా డొనేషన్లు తీసుకోనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *