mt_logo

తండాల ప్రజల కల నెరవేరింది : మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొడుగల్ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులతో కలిసి లబ్దిదారులకు ఇంటిపత్రాలు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘‘ ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలో 52 కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా మారడం వల్ల గిరిజనుల దశాబ్దాల కల నెరవేరింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు వేదికలు, పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న పనులు రాష్ట్రం రాకముందు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. తెలంగాణ పల్లెలు ఉన్నంత గొప్పగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. 12,769 గ్రామ పంచాయతీలలో నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్, పచ్చని చెట్లు, మిషన్ భగీరథ నీళ్లు, రైతు బంధు నిధులు, రైతు భీమా నిధులతోపాటు, ప్రతి రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. గతంలో విద్యుత్ లేక రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

సీఎం కేసీఆర్ రెండు వేల పెన్షన్ తో వృద్ధుల ఆత్మగౌరవం పెరిగిందని, కళ్యాణ లక్ష్మీ పథకంతో పదిలక్షల ఆడబిడ్డల పెళ్లికి సహాయం చేసామన్నారు. కేసీఆర్ కిట్ తో ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రసవాలు పెరగటంతోపాటు తెలంగాణలో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. గత పాలకుల హయాంలో రెండు లక్షల మంది ఫ్లోరోసిస్ బారిన పడగా, మిషన్ భగీరథతో తెలంగాణలో ఫ్లోరోసిస్ వ్యాధి లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించిందని, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ తో పేదలు ఆత్మగౌరవం బ్రతికే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. గురుకులాలతో ప్రపంచ స్థాయితో పోటీపడే విద్యార్థులను తయారు చేస్తున్నామన్నారు. ఇన్ని చేస్తున్నా… కేంద్రం మాత్రం అన్ని విషయాల్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తోందని అన్నారు. ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా గురించి అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారి వెంట పారిశ్రామిక కారిడార్ ఇవ్వమని చేసిన వినతులకు కనీస స్పందన కరువైందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్మారెడ్డి, గువ్వల బాలరాజుతోపాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *