mt_logo

‘డబుల్ బెడ్ రూం’ పథకం దేశంలో మరెక్కడా లేదు : మంత్రి కేటీఆర్

పేదల సొంతింటి కల నిజం చేస్తూ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం ఖైరతాబాద్ లోని ఇందిరానగర్ కాలనీలో 17.85 కోట్ల వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూం గృహాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో హైదరాబాద్ నగరంలో తప్ప చెన్నై, కలకత్తా, ముంబాయి, బెంగుళూరు మహా నగరాల్లో ఎక్కడా ఇలాంటి డబుల్ బెడ్ రూం ఇళ్లు చేపట్టలేదన్నారు. హైదరాబాద్ మహా నగరంలో గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన గృహాలు అందిస్తున్నామని, ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న ఇందిరా నగర్ లబ్ధిదారుల కల ఈ రోజు నెరవేరిందన్నారు. గత ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు ఇచ్చి ఏదో ఒక లింకు పెట్టి పేదలకు పంపిణీ చేసేవారని, కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి చిక్కులు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నామన్నారు. బ్రోకర్ లకు గాని ఎవ్వరికీ కూడా నయాపైసా కూడా ఇవ్వవలసిన అవసరం లేదని లబ్ధిదారులకు సూచించారు. నగరంలో 9714 కోట్ల వ్యయంతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఇందిరా నగర్‌ కాలనీ సిటీ సెంటర్లో ఉందని, ఇక్కడ చుట్టు ప్రక్కల హుస్సేన్ సాగర్, నూతనంగా నిర్మించే 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్, అన్నింటికీ దగ్గర నగరం నడి బొడ్డున నిర్మాణం చేసిన నేపథ్యంలో ఇదే ఇళ్లు ప్రైవేటు సంస్థ నిర్మిస్తే ఒక్కొక్క ప్లాట్ కు 50లక్షల నుండి 60 లక్షలకు పైగా రూపాయలకు అమ్మేవారని… పేదల మొహంలో చిరునవ్వు ఆత్మ గౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా పేదలకు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు.

ఇక్కడ నిర్మించిన గృహాలకు లిప్ట్‌తో సహా అన్ని మౌలిక వసతులతో పాటు తాగునీరు సౌకర్యం కల్పించామన్నారు. అంతేకాకుండా గృహ సముదాయం నిర్వహణ లబ్ధిదారుల భారం కాకుండా షాపులు కూడా ఏర్పాటు చేశామని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కాలనీని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. లిఫ్ట్, పరిసరాల పరిశుభ్రత పచ్చదనం సమర్థవంతంగా నిర్వహించాలని అందుకు యువకులు ముందుకు రావాలన్నారు. ఇందిరా నగర్ కాలనీ మోడరన్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ మంజూరు చేస్తున్నామని, ఈ కాలనీ పక్కన ఉన్న హెచ్‌ఎండిఏకు చెందిన ఎకరం స్థలంలో దీనిని నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *