ఏనాటికైనా తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని రాష్ట్ర ఐటీ,బి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్, నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్ లైన్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎట్టికైనా, మట్టికైనా తెరాస పార్టీనే ఉండాలి అన్నారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కడుపులో ఉండే బాధ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉండదన్నారు. వారి దృష్టిలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, మనకు మాత్రం ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఇంటింటికీ గ్యాస్ అందించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నర్సంపేటలో పీఎన్‌జీ గ్యాస్ లైన్ కింద 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రమంతటా తక్కువ ధరకే గ్యాస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలను నర్సంపేటలో నెలకొల్పుతామని, ఆహార శుద్ధి పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. నర్సంపేటలో చెరువు, రింగ్ రోడ్డు నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు 50 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేటకు రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేసి నీళ్లు ఇచ్చామన్నారు. దేవాదుల, కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ద్వారా ఎస్సార్ ఎస్పీ కింద ఉన్న భూములకు నీళ్లు పారుతున్నాయని కేటీఆర్ తెలిపారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చొరవతో ఆస్పత్రులు, డయాలసిస్ సెంటర్లు, సెంటర్ డివైడర్లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి నర్సంపేట అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. నర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకులను కడుపులో పెట్టుకుని చూసుకోవాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు.