గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను ఎన్నింటిని నెరవేర్చారని మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా 2047 కోసం ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించి, రానున్న 25 ఏళ్లలో ఆ టార్గెట్లను అందుకోవాలన్నారు. అయితే ప్రధాని మోదీ విధించిన ఆ లక్ష్యాలు గొప్పగానే ఉన్నాయని, కానీ 2022 ఆగస్టు 15 నాటికి చేరుకోవాలన్న లక్ష్యాల గురించి ప్రధాని పట్టించుకోవడంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ప్రధాని గతంలో చేసిన వాగ్ధానాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. క్యా హువా తేరా వాదా అన్న హ్యాష్‌ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్ ఓ ఫోటోను అప్‌లోడ్ చేశారు. దాంట్లో మోదీ గతంలో చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు. 2022 నాటికి ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామన్నారని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుస్తామని, ప్రతి ఇంటికీ కరెంటు సరఫరా చేస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మీ లక్ష్యాలను మీరు గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎక్కడ ఉంటుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.