mt_logo

ఇంత దిగజారి మాట్లాడిన ప్రధాని మోడీ ఒక్కరే : మంత్రి కేటీఆర్

దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించపరిచిన ప్రధాని మోడీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణపై మోడీకి ముందు నుంచి పగ ఉందని, గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధిలో దూసుపోతుంటే ఓర్వలేకపోతున్నారన్నారని మండిపడ్డారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడీ తెలంగాణపై పచ్చి అబద్దాలతో కించపరుస్తూ మాట్లాడారని, విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లుగా నీళ్లు, నిధులు,ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే తల్లి బిడ్డలను వేరు చేసేవిధంగా మోడీ మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ప్రధాని చేసింది శూన్యమన్నారు. రైల్వ్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, పాలమూరుకు జాతీయ హోదా, గిరిజన యూనివర్శిటీ, పార్మాసిటికి, మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు ఇష్టం లేకున్నా నల్ల చట్టాలు తెచ్చి.. రైతులు తిరగబడేసరికి చేసేదేమిలేక రద్దు చేశారన్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు.

దేశంలో మోడీ రాజ్యాంగం అమలవుతోందని, అన్ని సంస్థలను మోడీ తన గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. 50 ఏండ్ల తెలంగాణ పోరాటాన్ని కించపర్చడం మోడీకి తగదని, ఇంత వెకిలితనంగా మాట్లాడిన ప్రధాని ఎవరూ లేరని అన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమాన పర్చారని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నారని, నిజమైనా అంబేద్కర్‌వాది కేసీఆర్ అని తేల్చి చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. గతంలో ఒక ఓటు, రెండు రాష్ట్రాల నినాదంతో ముందుకొచ్చిన బిజెపి నేడు ఒకే నోరు.. రెండు నాల్కల మాటలు మాట్లాడడం తగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *