రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బుధవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతూ, అడ్డగోలుగా మాట్లాడిన మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో బైక్ ర్యాలీలతో నిరసనలు తెలుపుతూ… మోడీ శవయాత్రలు చేస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మోడీ వ్యతిరేక నినాదాలతో అట్టుడికి పోయాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మోదీ దిష్టిబొమ్మకు ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్‌రెడ్డి నేతృత్వంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు స్వర్గరథంలో శవయాత్ర నిర్వహించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో యువత పాల్గొని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ పట్ల బిజెపి వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ ఆమె దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మోడీ దిష్టి బొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. జమ్మికుంటలో గాంధీ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు నేతృత్వంలో దహనం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్‌ఎస్ ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌సీ తాతా మధు ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ శ్రేణులు నల్ల జెండాలను చేతబూని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోటార్ సైకిళ్లపై జిల్లా పార్టీ కార్యాలయం నుంచి జడ్‌పి సెంటర్‌కు చేరుకుని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కొత్తగూడెంలోనూ తెరాస కార్యకర్తలు ప్రధాని తీరును నిరసిస్తూ ఆందోళన దిగారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని బైక్ ర్యాలీ చేస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఔటర్ రింగురోడ్డు నుంచి నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలతో ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేతృత్వంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అలంపూర్ ఎంఎల్‌ఎ విఎం అబ్రహం నేతృత్వంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ వనపర్తిలో జరిగిన బైక్ ర్యాలీలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగర్ కర్నూల్‌లో ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేశారు. అదేవిధంగా నారాయణ పేట జిల్లా మక్తల్‌లో ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోన్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్‌ఎస్ శ్రేణులు బిజెపి వైఖరిని నిరసిస్తూ పట్టణంలో కార్యకర్తలు వెంటరాగా మంత్రి బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్‌లో నల్ల బ్యాడ్డీలు ధరించి జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎంఎల్‌ఎ పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో క్యాంప్ కార్యాలయం నుంచి రామదాసు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేటలో వెయ్యి బైక్‌లతో టిఆర్‌ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలతో భారీ ర్యాలీ చేశారు. సంగారెడ్డిలో జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఎల్‌ఎలు మెతుకుఆనంద్, కాలే యాదయ్య, ఎంఎల్‌సి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు.