తెలంగాణలో పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిరిసిల్లలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర చేనేత జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా కనీస స్పందన లేదని మండిపడ్డారు’.
ఊరుకునేది లేదు :
రాబోయే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పవర్ లూం క్లస్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం కేటాయించాలని, అలాగే పీఎం మిత్ర పథకం కింద 1000 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలన్నారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది. కేంద్రం కూడా సహకరించాలి.. కేంద్రం సహకరించకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
నేతన్నలను ఆదుకుంది మా ప్రభుత్వమే :
రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ చేనేత కార్మికుల జీవన విధానం గతం కంటే మెరుగ్గా ఉంది. 2016-17 నుండి చేనేత చేయూత, రుణ మాఫీ, మరమగ్గాల ఆధునీకరణ చేయడంతో పాటు ప్రభుత్వం నుండి నేరుగా ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థుల కోసం యూనిఫాం, ఎన్నో ప్రభుత్వ పరమైన ఆర్డర్లు ఇచ్చామన్నారు. కార్మికుడిని యజమానిని చేసే విధంగా వర్కర్ టూ ఓనర్ పథకం ప్రవేశపెట్టామన్నారు. గత ఏడున్నరేండ్లుగా నేత కార్మికుల కోసం రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో నేత కార్మికుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ హ్యాండ్ లూం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఉలుకుపలుకు లేదన్నారు. 26 బ్లాక్ లెవల్ క్లస్టర్ ఏర్పాటు కోసం వినతులిస్తే చేసింది నామమాత్రమే అని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.