mt_logo

పెట్టుబడులకు దేశంలోనే తెలంగాణ అత్యంత అనుకూలం.. ఫ్రెంచ్ సెనేట్ లో మంత్రి కేటీఆర్ ప్రసంగం

భారత్ లో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులతో వస్తే ఫ్రెంచ్‌ ఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న కేటీఆర్‌, శుక్రవారం ప్యారిస్‌లోని ఆ దేశ సెనేట్‌లో ‘యాంబిషన్‌ ఇండియా 2021’ బిజినెస్‌ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను వివరించారు. ‘గ్రోత్‌: డ్రాఫ్టింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ ఏ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. గత ఏడేండ్లుగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును మంత్రి వివరించారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు, సత్వర అనుమతులు, నాణ్యమైన మానవ వనరులు, వనరుల సేకరణ తదితర అంశాలను సెనేట్‌లో వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించాలని ఫ్రెంచ్‌ పెట్టుబడిదారులను కోరారు.

పారదర్శకమైన సత్వర అనుమతులు :

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్‌ గురించి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా వివరించారు. పారదర్శకతతో పాటు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ను అవలంబిస్తున్న అద్భుత చట్టం టీఎస్ ఐపాస్ అని చెప్పారు. రాష్ట్రంలో పెట్టే పరిశ్రమలకు ఈ చట్టం ద్వారా 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు లభిస్తాయని, 15 రోజుల్లో అనుమతుల రాకపోతే 16వ రోజున పూర్తి అనుమతులు లభించినట్టే భావించాలని అన్నారు. టీఎస్‌ఐఐసీలో రెండు లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ భూములకు విద్యుత్తు, నీరు, ఉత్తమ మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా ప్రభుత్వం తన సొంత ఖర్చులతో నైపుణ్య శిక్షణ ఇస్తూ యువతీ, యువకులను నాణ్యమైన మానవ వనరులుగా తీర్చి దిద్దుతున్నామని వివరించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకొంటే ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమంలో తెలంగాణను భాగస్వామిగా ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *