mt_logo

సకాలంలో తల్లీబిడ్డను కాపాడిన వైద్య విద్యార్థి స్వాతిరెడ్డిని అభినందించిన మంత్రి కేటీఆర్

అర్ధ‌రాత్రి సమయంలో రైలులో ఎలాంటి వైద్య పరికరాలు లేకుండా నిండు గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడింది ఓ వైద్య విద్యార్థి. గీతం మెడికల్ కాలేజీలో హౌస్ సర్జ‌న్ చదువుతున్న స్వాతిరెడ్డి విజయవాడ నుండి విశాఖ వెళుతున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తోంది. ఆమె ఎక్కిన కంపార్ట్మెంట్ లోనే శ్రీకాకుళానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి, ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. సత్యవతి డెలివరీకి మరో నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ, తెల్లవారుజామున నొప్పులు మొదలవగా.. ఖంగారు పడిన సత్యవతి భర్త, ఎవరినైనా సహాయం అడుగుదాం అని స్వాతిరెడ్డి బెర్త్ వద్దకు వచ్చి విషయం తెలిపాడు. స్వాతిరెడ్డి డాక్టర్ కావడంతో తక్షణమే స్పందించి దుప్పటి అడ్డం పెట్టి, ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా 15 నిముషాల్లో సాధారణ కాన్పు చేసి తల్లీ బిడ్డను ఇద్దరినీ కాపాడింది. సరైన సమయంలో వెంటనే స్పందించి కాన్పు చేసి తల్లీబిడ్డను కాపాడిన స్వాతి రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న గీతం కాలేజీ యాజమాన్యం స్వాతిరెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కాగా సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎలాంటి వైద్య ప‌రిక‌రాలు లేకపోయినా… పక్కన సహాయం చేసేవారు ఎవరూ లేకపోయినా… అర్ధ‌రాత్రి వేళ, పయనిస్తున్న రైలులో గ‌ర్భిణికి పురుడు పోసి త‌ల్లీ బిడ్డ‌ల‌ను క్షేమంగా కాపాడినందుకు స్వాతి రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *