బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఆదివారం జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కల్లు గీయడాన్ని బ్యాన్ చేయడంతో… నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అక్కడి ఈడిగ రాష్ట్రీయ మహామండలి ఆధ్వర్యంలో రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని… అందుకు సంబంధించిన పత్రిక క్లిప్పింగ్‌లను మంత్రి సభా వేదికపై ప్రదర్శించారు. బీజేపీ నేతలు చెప్పేవి ఒకటి… చేసేవి మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌడన్నలకు త్వరలోనే మోపెడ్‌లను ఇవ్వడంతో పాటు, ఇచ్చిన హామీలన్నింటినీ బరాబర్ అమలు చేస్తామని..గౌడన్నలు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మీతోనే ఉండి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న ఫ్లోరైడ్‌ను మిషన్ భగీరథ నీటితో తెలంగాణ ప్రభుత్వం తరిమేసిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కులవృత్తులు ధ్వంసమైతే తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా గ్రామీణ ప్రాంతాల్లోని కులవృత్తులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, గౌడలకు కూడా ఎన్నో మంచి పనులు చేశామన్నారు. రాష్ట్రంలో 2,29,852 మంది గౌడలు టీఎస్‌టీలో 4,181 మంది, టీఎఫ్‌టీల్లో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. యాభై ఏండ్లు పైబడిన 70వేల మంది గీత కార్మికులకు నెలనెలా 2వేల పింఛన్ ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా ఈ తరహాలో సాయం చేస్తున్న ప్రభుత్వాలు లేవన్నారు.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని చెప్పారు. సాయం అందించడంలో జాప్యాన్ని నివారించి వారం, పది రోజుల్లోనే అందేలా నిబంధనలు సులభతరం చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,092 మంది కల్లుగీత వృత్తిదారుల కుటుంబాలకు దాదాపు 30లక్షల నష్ట పరిహారం అందజేసినట్లు వివరించారు. గౌడన్నలకు వైన్స్ దుకాణాల్లో 15శాతం రిజర్వేషన్ కల్పించామని, సొసైటీలకు అవకాశం కల్పించి ఎక్కువమంది లబ్ధి పొందేందుకు సవరణలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. గతంలో ఉన్న 16 కోట్ల పాత బకాయిలు రద్దు చేయడంతోపాటు 8 కోట్ల రూపాయలు కల్లుగీత రకం పాత బకాయిలను కూడా రద్దు చేశామని తెలిపారు. లైసెన్స్‌ల రెన్యువల్‌ను పదేండ్లకు పెంచినట్లు తెలిపారు.
హరితహారంలో 5 కోట్ల తాటి, ఈత, కర్జూర మొక్కలు నాటామని చెప్పారు. 2019లో నీరా పాలసీని తెచ్చి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌లకు చేప పిల్లలు , మోపెడ్‌లు, వలలు ఇస్తున్నామని.. పద్మశాలీలకు నూలుపై సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నామని..గౌడన్నలకు కూడా ఇదే తరహాలో సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మనసే కాదు.. ఆలోచన కూడా పెద్దదని మంత్రి కేటీఆర్ అన్నారు. దళిత బంధు పథకాన్ని సమాజంలో అట్టడుగున ఉన్న దళితులతో ప్రారంభించారని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ ఇదే తరహాలో న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, ప్రకాశ్ గౌడ్, బాల్క సుమన్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, తెలంగాణ గౌడ సంఘం నేతలు పల్లె లక్ష్మణ్ గౌడ్, బాలగోని బాలరాజు గౌడ్, నారాయణ గౌడ్, పల్లె రవికుమార్, వెంకన్న గౌడ్, మెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, వేములయ్య గౌడ్, భిక్షపతి గౌడ్, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, హన్మంతు వెంకటేశ్ గౌడ్, శ్రీనాథ్ గౌడ్, రామకృష్ణగౌడ్, యాదగిరి గౌడ్, కీర్తిలతా గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.