ఒక్కపంట కూడా పండని తన భూమిలో కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు తీస్తూ తన పంటలో కొంత మొత్తాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా అందిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువరైతు పన్నాల శ్రీనివాస్ రెడ్డి నేటి యువతకు స్ఫూర్తి అని అభినందించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు కాళేశ్వరం జలాలతో తాను పండించే రెండు పంటలనుంచి వచ్చిన ఆదాయాన్ని పంటకు పదివేల రూపాయల’చొప్పున ఆరునెల్లకోసారి సిఎంఆర్ఎఫ్ కు జమ చేయాలనే తలచి, శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను తెచ్చిన 10 వేల రూపాయలను అందించాడు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి రంగం అభివృద్దితో పాటు విద్యుత్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధితో.. తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరమన్నారు. అంతే కాకుండా వాణిజ్య పంటలను వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారని, ఏదో సంస్థలో అర కొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామని కొనియాడారు. ఈనేపథ్యంలో… శ్రీనివాస్ రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయమని, సిఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు సాయం చేసేందుకు తన పంటలో కొంతభాగాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి స్పూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని, ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డికి నా అభినందనలు అని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు.

