‘హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం. ఇలాంటి మెట్లబావులు ఎక్కడున్నా సరే వెతికి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడాది పాటు అహర్నిశలూ శ్రమించి బావి నుంచి 3900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి మట్టిలో నుంచి మాణిక్యాన్ని అందించిన పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి, స్థానికులందరికీ ధన్యవాదాలు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ బావి వద్ద ఓ మ్యూజియాన్ని, కెఫెటేరియా వంటి వసతులతో మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాం. ఇంత అందంగా మారిన ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత బన్సీలాల్‌పేట స్థానికులపైనే ఉంది’. అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమవారం బన్సీలాల్‌పేట మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు.
ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా హైదరాబాద్‌కు యునెస్కో నుంచి గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలోని బన్సీలాల్‌పేటలో రూ. 10కోట్ల వ్యయంతో భావి తరాలకు తెలియజేసేలా అందంగా తీర్చిదిద్దిన చారిత్రక పురాతన బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు బావి పరిసర ప్రాంతాలను మంత్రి కేటీఆర్ కలియతిరిగారు. బన్సీలాల్‌పేట్ ప్రధాన ద్వారం, బాహ్య కట్టడాల పరిరక్షణ చర్యలు, చక్కటి పచ్చదనంతో నిండి ల్యాండ్‌స్కేప్ గార్డెన్ , ఓపెన్ యాంపీ థియేటర్, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, ప్రత్యేక ఫొటో గ్యాలరీలను మంత్రి కేటీఆర్ సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కులీకుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరు మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్‌తో కలిసి ఆధునీకరించామని చెప్పారు. వాటికి యునెస్కో నుంచి అవార్డు లభించదన్నారు. అదే విధంగా మొజాంజాహీ మార్కెట్, మిరాలంమండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్‌పేట సరాయి కలిపి మొత్తం 44 మెట్ల బావులను ఆధునీకరించి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు.
ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్‌గా..
నిజాం పాలనలో ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత బన్సీలాల్‌పేట్ మెట్లబావిదని, అంతటి సేవలందించిన మెట్ల బావి ఇక ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్‌గా నిలువనుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ బావిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులదేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్, కూచిపూడి డ్యాన్సర్ దీపికారెడ్డి నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బావిని అందంగా ముస్తాబు చేయడానికి 13 నెలల పాటు అహర్నిశలు కృషి చేసిన రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనా రమేశ్, గండిపేట వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి రాజశ్రీ, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులకు మంత్రి కేటీఆర్ మెమోంటోలతో ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సాయన్న, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఎమ్మెల్సీలు సురభీ వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ తదితరులు పాల్గొన్నారు.