mt_logo

10.91 కోట్లతో ఫీవర్ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్ : మంత్రి హరీష్ రావు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ఫీవర్ ఆసుపత్రిలో 10.91 కోట్లతో నిర్మించనున్న కొత్త ఓపీడీ బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ఫీవర్ ఆసుపత్రిలో కొత్త ఒపిడి బ్లాక్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు 13 హర్సే వెహికల్స్ (పరమపద వాహనాలు), 3 అంబులెన్స్ ల దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం తక్షణం 5 కోట్లు విడుదల చేశామని, ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉందని, 1915లో క్వారంటైన్ సెంటర్ గా మొదలైందని, కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరు గాంచిందన్నారు. అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుందని, ఔట్ పేషంట్ విభాగంలో రోజుకు సగటున 500-600, సీజనల్ వ్యాధుల సమయంలో 1000 వరకు వస్తున్నాయని, అందుకే కొత్త ఒపిడి బ్లాక్ ను నిర్మించుకున్నామన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో మార్చురీ అభివృద్ధికి 60 లక్షలు రూపాయలు మంజూరు చేశామని, 50 లక్షలతో డయాలసిస్ వింగ్ మంజూరు చేశామన్నారు.

దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అంబులెన్స్ కోసం 5-10 వేలు ఖర్చు అయ్యేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉచితంగా పార్థివ వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 61 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం 32.54 కోట్లు విడుదల చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఇండియాలోనే బెస్ట్ మార్చూరిలను అధ్యయనం చేసి, 9 కోట్లతో ఓయూ ఆస్పత్రిలో అభివృద్ధి చేస్తున్నామని, నిన్న పార్లమెంట్ లో భారత దేశంలో ఏ రాష్ట్రాలు పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాయని, అని ఒక ఎంపీ అడిగితే తెలంగాణ 3వ స్థానంలో ఉందని కేంద్రం చెప్పిందన్నారు. ప్రజా వైద్యంలో 1690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నామని, గాంధీ, ఓయూ, కోరంటి మీద లోడ్ పెరిగిందని, కాబట్టి సీఎం కేసీఆర్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖానలు ఇవ్వలేదని, గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే వచ్చేదని, సీఎం కేసీఆర్ ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచారని, దవాఖానలో మందుల కొరత ఉండొద్దన్నారు. వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ మేరకు త్వరలో భర్తీ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *