mt_logo

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం వచ్చే వంగడాలను సృష్టించండి : మంత్రి హరీష్ రావు

రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసేలా ప్రోత్సహించే బాధ్యత వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు, పండ్లు, కూరగాయలు పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తూ.. ఖర్చులు తగ్గి లాభాలు వ‌చ్చే వంగడాలను అభివృద్ది చేయాలి అని స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా ల‌క్ష్మ‌ణ్ ఉద్యాన వ‌ర్సిటీ ఏర్పాటు చేసి ఏడేండ్లు అయిన సంద‌ర్భంగా..ఈ ఏడేండ్ల‌లో కనుగొన్న కొత్త అంశాలను ప్ర‌ద‌ర్శించారు. వివిధ విభాగాల విభాగాల ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లను హ‌రీశ్‌రావు సంద‌ర్శించారు. ఉద్యాన వ‌ర్సిటీ సాధించిన ప్ర‌గ‌తిపై సుద్దాల అశోక్ తేజ ర‌చించిన ప్ర‌త్యేక గీతాన్ని మంత్రి విడుద‌ల చేశారు. వ‌ర్సిటీ పండించిన పంట‌ల విక్ర‌యాల‌కు ట్రేడ్ మార్క్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎకరా ఆయిల్ ఫామ్ పంట సాగుకు 1,40,000ల‌ను ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి. జిల్లాలోని కొన్ని గ్రామాలను యూనివర్సిటీ దత్తత తీసుకుని.. మార్పు దిశగా కృషి చేయాలి అని సూచించారు. లాభదాయ సాగుకు ఉద్యానవన వ‌ర్సిటీ తమ వంతు కృషి చేయాల‌న్నారు.

ప‌రిశోధ‌న‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి :

వ్యవసాయ, ఉద్యానవన వ‌ర్సిటీలు బోధనతో పాటు పరిశోధన, విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలి అని హ‌రీశ్‌రావు సూచించారు. ఉద్యానవన యూనివ‌ర్సిటీ సమీపంలోనే 140 ఎకరాలను సేకరించి విశ్వవిద్యాలయ అవసరాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనల పై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉద్యానవన పంటల సాగులో కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకోవాలని, ల్యాబ్ టు ల్యాండ్ వెళితేనే ప్రయోజనం ఉంటుంద‌న్నారు. ఉద్యానవన వ‌ర్సిటీకి నిధుల మంజూరు, రిక్రూట్ మెంట్, భూ కేటాయింపులు, ఇతర సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా చూస్తాన‌ని ఈ సందర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *