mt_logo

కార్పోరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలి : మంత్రి హరీష్ రావు

కార్పోరేట్ పాఠశాలను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మన ఊరు మన బడితో పాటు పలు సంక్షేమ పథకాల అమలుపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం 390 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులను ప్రజల అత్యంత అవసరమైన పనులకు ఉపయోగించే విధంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. మన ఊరు-మన బడి ఒక అధ్బుతమైన పథకమని, దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మన ఊరు మన బడి కోసం 7,289 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులు సక్రమంగా వినియోగిస్తే విద్యా వ్యవస్థలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 9వ తేదీ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పనులను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్కూళ్ల మరమ్మతులు, నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు మన ఊరు మన బడికి పాఠశాలలను సిద్దం చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు షారుఖ్ హుసేన్, శేరి సుభాష్రెడ్డి, రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *