mt_logo

గురుకులాలపై ఏటా రూ. 3300 కోట్లు ఖర్చు పెడుతున్నాం : మంత్రి హరీష్ రావు

నార్సింగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిదండ్రులకు నులిపురుగుల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. పిల్లలు తిండి తినక.. రక్తం తగ్గిపోయి.. బరువు తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారని, ఇందుకు కారణం నులిపురుగులని, 1నుండి 19 ఏళ్ల పిల్లలపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి వివరించారు. పరిసరాల అపరిశుభ్రత, కాళ్లు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం, కలుషిత ఆహారం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయన్నారు.

రాష్ట్రంలో విద్యా శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో తెలంగాణ కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కార్యక్రమం నిర్వహిస్తున్నదని తెలిపారు. తద్వారా అన్ని అంగన్ వాడీ సెంటర్లు, పాఠశాలలు, కాలేజీల్లో, కమ్యూనిటీ ప్లేసెస్ లో 1-19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 98,97,600 మంది చిన్నారులకు ఈరోజు టాబ్లెట్స్ వేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అన్ని గురుకులాల్లో ఆయా పరిధి పిహెచ్సి డాక్టర్లు విజిట్ చేయాలన్నారు.

నార్సింగిగురుకులం కార్పొరేట్ బడి లాగే ఉందన్నా హరీష్ రావు… తెలంగాణ రాకముందు గురుకులాల్లో దొడ్డు బియ్యం, రుచి పచీ లేని తిండి ఉండేదని కాని తెలంగాణ వచ్చాక చికెన్, మటన్, నెయ్యి ఇస్తున్నామని, పిల్లలకు జాతీయ పోషకాహార సంస్థ సూచించిన మేరకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.

తెలంగాణ రాకముందు గురుకులాల మీద ఏటా 380 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేవారని..ఇప్పుడు 3300 కోట్లు. ఖర్చు చేస్తున్నామని అన్నారు. అప్పుడు కేవలం 298 గురుకులాలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 923 కు పెంచామని వెల్లడించారు. ఉన్నాయి. ఈ ఏడాది నుండి గౌలి దొడ్డి గురుకులంలో ఇచ్చే జాతీయ స్థాయి పరీక్షల శిక్షణ కార్యక్రమాలు నార్సింగి గురుకులంలో కూడా ఇస్తామన్నారు. గురుకులాల్లో కాంట్రాక్ట్ పోస్టులు త్వరలో రెగ్యులర్ చేస్తామని, ఒక్క పోస్ట్ ఖాళీ లేకుండా భర్తీ చేసేందుకు త్వరలో నోటిికేషన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఖర్చు చేసేది రెండు రకాలుగా చూస్తారని… కాపిటల్, రెవెన్యూ ఎక్స్ పెండేచర్. పిల్లలపై భవిష్యత్ కోసం చేసే ఖర్చును సీఎం గారు కాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూస్తున్నారని, అందుకే స్వరాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలను కాలేజీలుగా సీఎం అప్ గ్రేడ్ చేశారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారి మహబూబ్ నగర్, సంగారెడ్డిలో గురుకుల లా కాలేజీ ఏర్పాటు చేశామని, త్వరలోనే గురుకుల పీజీ కళాశాల స్టార్ట్ చేస్తామని, గురుకుల కళాశాలలను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, స్థానిక కౌన్సిలర్ ప్రవీణ్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *