mt_logo

తట్టెడు మట్టిపని చేయనివారికి నైతికత ఎక్కడిది?

ప్రాణహిత-చేవెళ్ళ రీడిజైన్ వల్ల రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన శుద్ధ అబద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కన్నా 40 వేల ఎకరాలకు అదనంగా పాలమూరు ప్రాజెక్టుతో నీరు ఇస్తామన్నారు. సోమవారం జలసౌధలో జరిగిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ సాగు, తాగునీటి ప్రాజెక్టులపై అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోయి, భవిష్యత్తు కనిపించక, దిక్కుతోచని స్థితిలో ఉండి కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారని, పదేళ్ళు అధికారంలో ఉండి తట్టెడు మట్టి ఎత్తిపోయని నాయకులు ప్రాజెక్టులను ఉరకలెత్తిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రాణహిత-చేవెళ్ళ శంకుస్థాపన జరిగిన తర్వాత ఎనిమిదేళ్ళపాటు మంత్రిగా ఉన్నా ప్రాజెక్టుకు 24వేల ఎకరాలు కావలసి ఉండగా కనీసం ఒక్క ఎకరం కూడా సేకరించలేదని హరీష్ రావు విమర్శించారు.

సర్వేలు, డిజైన్లు పేరిట కాంగ్రెస్ నాయకులు కోట్లు దండుకున్నారని, ఎనిమిదేళ్ళలో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని, కానీ తాము నాలుగేళ్ళలో పూర్తిచేసి చూపిస్తామని స్పష్టం చేశారు. రీడిజైన్ వల్ల రంగారెడ్డి జిల్లాకు ఎక్కువ మేలు కలుగుతుందని, గత ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ళ డిజైన్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, కానీ కొత్తగా రీడిజైన్ చేయడం వల్ల మేము 40వేల ఎకరాలకు అదనంగా నీరు అందిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్దదైన ఇబ్రహీంపట్నం చెరువును కాంగ్రెస్ నాయకులు ఏనాడూ పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 16 కోట్లతో దానిని అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పారు.

రంగారెడ్డి జిల్లాకు ఏదో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్న వీరికి ఆ జిల్లా మీద ప్రేమలేదనే విషయం ప్రజలకు కూడా తెలుసని, అందుకే అన్ని సీట్లలో వీళ్ళను ఓడించారని హరీష్ ఎద్దేవా చేశారు. కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు కట్టారని, కానీ తాము మాత్రం ప్రజలకు నీళ్లివ్వాలనే ధృఢసంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఎప్పుడైనా కాంగ్రెస్ నాయకులు లైడార్ సర్వే గురించి విన్నారా? కనీసం దాని గురించి ఆలోచించారా? రెండు రోజులు ఆలస్యమైనా సరే పకడ్బందీగా ప్రాజెక్టుల డిజైన్ రూపొందించి పూర్తిచేయాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని హరీష్ రావు తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు గందరగోళంలో పడిందికాక ప్రజల్ని కూడా గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *