కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రైతుల ఆత్మహత్యలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని, సూక్ష్మరుణ సంస్థలు గ్రామాల్లో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్ నుండి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాపై ప్రచారం చేయాలని, 30 శాతం కంటే తక్కువ వర్షాలు ఉన్న చోట ముందుగా రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాలని మంత్రి సూచించారు. బిల్లులు చెల్లించలేదని ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయొద్దని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వారంలోగా నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ రైతులు కన్నీరు పెట్టకుండా చూడడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వర్షాభావం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలను వెంటనే పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.