సోమవారం ఉదయం 10 గం.లకు శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బృందం రాత్రి 8 గంటల సమయంలో చైనాలోని డాలియన్ నగరం చేరుకుంది. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ కేశవరావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జగదీష్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎంవో అధికారులు నర్సింగరావు, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ చైనా పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి పలు ప్రయోజనాలు ఉంటాయని, కేసీఆర్ ఆశయమైన బంగారు తెలంగాణ సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని పేర్కొన్నారు. అంతకుముందు సీఎం తనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారిని పలకరిస్తూనే అధికారులతో పలు అంశాలపై సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పది రోజులపాటు శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఏపీకి కేటాయించిన పోలవరం ముంపు మండలాలలో పనిచేస్తున్న 233 మంది తెలంగాణ ఉద్యోగులకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి తెలంగాణకు తీసుకొచ్చే ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో 285 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.