చారిత్రాత్మక రెవెన్యూ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ బిల్లుపై సభ్యులు సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. ఏ ఉద్దేశంతో, ఏమి ఆశించి ఈ బిల్లును తీసుకొచ్చామనేది సభ్యులు మాట్లాడిన తర్వాత సభకు వివరంగా చెప్తానని సీఎం స్పష్టం చేశారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అక్బరుద్ధీన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు చట్టానికి ఎంఐఎం పూర్తిగా మద్దతు ఇస్తుందని అన్నారు. భూములకు సంబంధించి వివిధ చట్టాలు వచ్చాయి. చట్టాలు ఎన్ని వచ్చినా చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చాక చాలామంది భూములు పోయాయి. వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారు. పట్టాల ఎంట్రీలో చాలా అక్రమాలు జరిగాయి. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి రికార్డుల్లో ఉన్న వివరాల్లో తేడాలు ఉన్నాయని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని అక్బరుద్ధీన్ పేర్కొన్నారు.
ఆలయాలు, దర్గా, వక్ఫ్ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయొద్దని, ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను కాపాడాలని ఓవైసీ కోరారు. స్లమ్ ఏరియాల్లో లే అవుట్లు లేవని, స్లమ్ ఏరియాలను నోటరీ ద్వారా కొనుగోలు చేశారు. స్లమ్ ఏరియాల్లో పేదలు రేకుల షెడ్లు, చిన్న గృహాలు నిర్మించుకున్నారు. ఈ ఏరియాల్లో నోటరీ ద్వారా కొనుగోలు చేసి భూములకు రక్షణ కల్పించాలని అక్బరుద్ధీన్ ప్రభుత్వాన్ని కోరారు.