శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్ లు, 3 ఆర్ యూబీ, ఒక వంతెనతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద మొత్తం 18 ప్రాజెక్టులను పూర్తి చేశామని, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ఈ ప్రాజెక్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టామని, హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. నగర అభివృద్ధి కోసం దాదాపు రూ. 30 వేల కోట్లకు గానూ రూ. 6 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో భూ సేకరణ కోసం చర్యలు చేపట్టామని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ కు భాధ్యతలు అప్పజెప్పిన తర్వాత భూసేకరణ వేగవంతంగా జరుగుతుందన్నారు. ప్రజా రవాణాను మెరుగుపరిచే క్రమంలో మెట్రో తో పాటు ఆర్టీసీని కూడా అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.
గత ఐదు సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ 81 రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టింది. అందులో 44 రోడ్లు పూర్తయ్యాయి. ఎస్ఆర్ డీపీ కింద రోడ్డు విస్తరణకు 32 రోడ్లు తీసుకున్నాం. వీటిలో 18 రోడ్లు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. మిస్సింగ్ లింక్ రోడ్లను 19 తీసుకుంటే 12 పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు అనేక నిధులు ఖర్చు పెట్టాం. కేవలం పాత బస్తీకే ఈ ఐదేళ్లలో రూ. 713 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల విస్తరణ చేపట్టాము. సాధారణ రోడ్ల కింద రూ. 477 కోట్లు, ఎస్ఆర్డీపీ కింద రూ. 228 కోట్లు, లింకు రోడ్ల కింద రూ. 8 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. నగరంలోని రోడ్లను విస్తరిస్తాం. పాత నగరం, కొత్త నగరం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.