mt_logo

మిడ్ మానేరు ప్రాజెక్టును 2016 కల్లా పూర్తి చేస్తాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్ మానేరు ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు చెప్పారు. సోమవారం మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మానేరు గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో జరిపిన నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, శాభాష్ పల్లి వాగు మీద 170 కోట్ల రూపాయలతో నాలుగులైన్ల వంతెనను నిర్మించనున్నామని, ఇందుకోసం 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి 12 నుండి 14 నెలల్లో ఈ వంతెనను పూర్తి చేస్తామని చెప్పారు. మిడ్ మానేరుకు సంబంధించి నాలుగు గ్రామాల భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యతో పాటు ఇతర సమస్యలన్నీ మార్చి 5లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా ప్రాణహిత 9వ ప్యాకేజీ ద్వారా ముస్తాబాద్ మండలంలో ఏడు గ్రామాలు కలుపుకుని డివిజన్ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మద్దికుంట వద్ద హైలెవెల్ కెనాల్ ను ఏర్పాటు చేసేందుకు 1500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని హరీష్ పేర్కొన్నారు. అనంతరం పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నర్మాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు, సిమెంట్ లైను కోసం రూ.3.75 కోట్లు మంజూరు అయ్యాయని, ఎగువమానేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు. త్వరలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని, 3 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ హన్మంతరావు, ఆర్ అండ్ యార్ కమిషనర్ మాణిక్ రాజు, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూ ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *