mt_logo

మన బావులల్ల మళ్లా నీళ్లు రావాలంటే…

By: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చిన్నతనంలో చేవెళ్ల దగ్గరున్న మా స్వంత ఊరు ధర్మాసాగరం పోవడమంటే మాకు చాలా ఖుషీగా ఉంటుండె. సెలవుల్లో ఎంతో ఉల్లాసంగా గడిపేవాళ్లం. పొద్దటిపూట మొత్తం బావులల్ల దుంకి ఈత కొడుతుండె. అక్కడి నుండి చెరకు తోటలకు పోయి చెరకు గడలను నమిలేవాళ్లం.

చెరకు నుండి బెల్లం వండినప్పుడు వచ్చే “కరుగు” అనే తియ్యటి పదార్ధం తినేటోళ్లం.

సెలవులు అయిపోయినంక తిరిగి పట్నంల ఉన్న స్కూలుకు పోవాలంటే ఎంతో బాధ అయితుండె.

ఇప్పుడు అదే బావుల్లో దుంకితె బొక్కలు ఇరుగుతయి. ఎందుకంటె ఆ బావులన్ని ఎండిపోయి రాళ్లు తేలినయి. నీళ్ల అవసరం బాగా ఉండే చెరకును ఇప్పుడెవరూ పండించట్లేదు ఇక్కడ. ఇక్కడిప్పుడు బెల్లం వండే అవకాశమే లేదు. ఇప్పుడు ధర్మాసాగరమే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లానే ఎండి బీడువారింది. ఇక్కడి యువత అంతా వలసబోయింది. మా పిల్లలకు ఇప్పుడు ధర్మాసాగరం పోవడమంటే పెద్దగా ఆసక్తిలేదు.

పశ్చిమ రంగారెడ్డి జిల్లా చారిత్రకంగానే నీటిపారుదల విషయంలో నిర్ల్యక్షానికి గురైన ప్రాంతం. ఇప్పుడా నిర్ల్యక్షం తారాస్థాయికి చేరిన పర్యవసానంగా ఇక్కడ సాగునీటికే కాదు తాగునీటికి కూడా కటకట ఏర్పడ్డది. నీటిపారుదలలో మొత్తం తెలంగాణనే నిర్ల్యక్షానికి గురికాగా, అందులో రంగారెడ్డి జిల్లా మరీ ఎక్కువ.

ఫొటో: శిధిలమైపోయిన చందన్ వెల్లి ప్రాజెక్టు. దీన్ని 1872లో నిర్మించారు

ఇక్కడ ప్రాజెక్టులు, కాలువలు లేకపోవడమే కాదు, ఉన్న గుప్పెడు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ప్రభుత్వ నిర్ల్యక్షానికి గురై నాశనమైపోయినయి. అందులో కోట్ పల్లి. మోమిన్ పేట్, గడిసింగపూర్ వంటివెన్నో. 1872లో నిర్మించిన చందన్ వెల్లి లాంటి పురాతన చెరువులు, దానినుండి మొదలయ్యే ఫిరంగి కాలువ వంటివయితే పూర్తిగా శిధిలమయ్యి పనికిరాకుండా పోయాయి.

హైదరాబాదుకు మంచినీటి సరఫరా చేసే గండిపేట, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు పశ్చిమ రంగారెడ్డి జిల్లానే పరీవాహక ప్రాంతం. ఇక్కడ కురిసే వాననీటి మీద కూడా ఇక్కడి ప్రజలకు అధికారం లేదు – ఆ వాన నీరంతా హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి, ఆ నగర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇంత త్యాగం చేసిన ఈ ప్రాంత యువతకు మాత్రం హైదరాబాద్ నగరపు ఉద్యోగాల్లో న్యాయమైన వాటా దొరకదు.

పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో ఒక్క తాటిచెట్టు కూడా మొలవదంటే ఈ ప్రాంతం తెలంగాణలోనే కాదు, మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో, మొత్తం భారతదేశంలోనే విలక్షణమైన ప్రాంతం అని అర్థమవుతుంది మనకు.

ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందో, లేక తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడో కట్టిన రెండు మూడు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రం ఉన్నాయి ఈ ప్రాంతంలో. అయిదు దశాబ్దాలు ప్రజలు ఎన్నో విధాలుగా పోరాటం చేస్తే, చివరికి కాంట్రాక్టర్లకు, రాజకీయనాయకులకు లబ్ది చేకూర్చే ఒక క్లిష్టమైన ప్రాజెక్టు – ప్రాణహిత చేవెళ్లను మొదలుపెట్టారు. ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలోనీ చత్తీస్గడ్ సరిహద్దు దగ్గరనుండి చేవెళ్లకు నీటిని 11 దశల్లో 2000 ఫీట్లకు ఎత్తిపోసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వ్యయం మాత్రం భారీగా అవుతోంది. దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందా అనేది అనుమానమే. ఒకవేళ అనుకున్నట్టు దీన్ని కట్టిపూర్తి అవడానికి 20 యేళ్లు పడుతుంది. ఇక ఈ ఎత్తిపోతల నిర్వహణకు భారీ ఎత్తున కరెంటు అవసరమవుతుంది. ఈ కరెంటు కొరకు మళ్ళా ఆంధ్ర రాష్ట్రం మీద ఆధారపడే అవసరం రావొచ్చు.

పశ్చిమ రంగారెడ్డి నీటి సమస్యను తెలంగాణ రాష్ట్ర సమితి, మరియు కొంతమంది రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు అధ్యయనం చేసి ఈ ప్రాంతానికి కృష్ణా నది నుండి నీటిని తీసుకువచ్చే అవకాశం ఉన్నదని కనుగొన్నారు. కృష్ణా నది నుండి పశ్చిమ రంగారెడ్డి జిల్లా కేవలం 100 కిలోమీటర్ల దూరంలేనే ఉన్నది. ఈ ప్రాజెక్టు కట్టడం అయిదేళ్లలో పూర్తిచేయవచ్చు.

స్వార్ధపరులైన స్థానిక నాయకత్వపు అండతో, కొంతమంది రాయలసీమ నాయకులు కృష్ణా జలాలను ఈ ప్రాంతప్రజలకు దక్కకుండా అడ్డుకున్నారు.

ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రణాళిక ప్రకారం రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాకు 3-5 యేళ్లలో నీటిని అందించడం. ఇక రెండోది అదే సమయంలో జిల్లాలో ఉన్న చిన్న నీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ. ఇందులో భాగంగా ఫిరంగి కాలువను కూడా పునరుద్ధరించి ఈ ప్రాంతంలో పడ్డ వర్షం నీరు, ఈ ప్రాంతంలోనే వినియోగం అయ్యేలా చూడడం.

హైదరాబాదుకు తాగునీటి కొరకు కృష్ణా నీటిని తేవడం, అట్లా తెచ్చిన నీటితో అవసరమైతే గండిపేట, హిమాయత్ సాగర్ లను నింపడం, కృష్ణా మంచినీటి పథకంలో మిగిలిన అన్ని స్టేజిలను పూర్తిచేయడం కూడా మా ప్రణాళికలో భాగమే.

అప్పుడు మనందరం మరొకసారి మన బాల్యంలో చేసినట్టు బావుల్లో దుంకి ఈతకొట్టొచ్చు, మజా చేయొచ్చు. అప్పుడు మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు…వారికి మెరుగైన విద్య, చక్కని భవిష్యత్ ఇచ్చేంత డబ్బు మన జేబుల్లో ఉంటుంది.

వ్యాసకర్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ తొలితరం నాయకుడు కొండా వెంకట రంగారెడ్డి మనవడు. 1950ల్లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాడిన గొప్ప నాయకుడు వెంకట రంగారెడ్డి. నేటి రంగారెడ్డి జిల్లా ఆయన పేరు మీదనే ఏర్పాటయ్యింది.

వ్యాసకర్త ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నారు. ఆయన గురించి పూర్తి సమాచారం కొరకు ఈ వెబ్ సైట్ చూడండి: www.kvrformp.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *