mt_logo

ఏపీలో రాష్ట్రపతి పాలన షురూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి జైరాం రమేష్ వెల్లడించారు.రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ సంతకం చేయగానే రాష్ట్రపతి పాలన ప్రారంభమవుతుంది. రెండు రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగేవరకు పాలనా వ్యవహారాలను గవర్నర్ చూసుకుంటారు. రాష్ట్ర మంత్రులు నిర్వహించే బాధ్యతను రిటైర్డ్ అధికారులు గవర్నర్ కు సహాయంగా ఉండి నిర్వర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 41 ఏళ్ళ తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పాలన ఉండనుంది. 1954 లో ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోలేక పోయినందుకు ప్రభుత్వం పడిపోయినందున రాష్ట్రపతి పాలన విధించారు. మళ్ళీ 1973 లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు శాంతిభద్రతల ఉల్లంఘన జరిగినందున అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కానీ రాజ్యాంగ సంక్షోభం కానీ ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. విభజన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని, అవసరమైతే ఎన్నికలు జరిగాక అప్పాయింటెడ్ తేదీని బట్టి రెండు రాష్ట్రాలూ వేర్వేరు అసెంబ్లీలు ఏర్పాటు చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులను ఎన్నుకోవచ్చునని ఎలెక్షన్ కమిషన్ గతంలోనే చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *