mt_logo

ప్రజలకు ఏది మంచిదైతే అదే నా దారి-కేసీఆర్

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పీ. మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ లో విలీనం కావాలా? వద్దా? అనే విషయంలో ప్రజల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటానని, ప్రజలు ఏది మంచిది
అని చెప్తే ఆ దారిలో నడుస్తానని అన్నారు. సభకు హాజరైన ప్రజలను విలీనం కావాలా? వద్దా? అని అడుగగా వారు పెద్దపెట్టున అరుస్తూ వద్దు అని నినాదం చేశారు. మార్చి 3 న జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు అంతా వస్తున్నారని, ఏ నిర్ణయం అయినా తాను ఒక్కడినే తీసుకోనని, అందరం కలిసే తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రం రాగానే సరిపోదని, బంగారు తెలంగాణను నిర్మించుకోవడానికి ఎమ్మెల్యేలు 24 గంటలు కష్టపడ్డా సమయం సరిపోదని, ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నామో అంతే స్థాయిలో పునర్నిర్మాణంలో విజయం సాధించుకోవాలని చెప్పారు. 15 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని మొదలుపెట్టి పక్కదారి పట్ట, ఉద్యమాన్ని విడిచిపెట్ట అని చెప్పానని, పక్కదారి పడితే రాళ్ళతో కొట్టి చంపండి అన్నానని కేసీఆర్ ఉద్వేగంగా చెప్పారు. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడ్డాక ఇంతకాలానికి తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను కాపాడుకునేందుకు కృషిచేయాలి. హక్కుల కోసం పోరాడాలి. నాయకుడు బలంగా ఉంటేనే అన్నిటినీ సాధించుకోవచ్చని, రాబోయే ఆరేడు ఏళ్లలో బంగారు తెలంగాణను మీకు అప్పగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రా పార్టీలు ఇంకా మనకు అవసరమా అనే విషయాన్ని ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. బిల్లు ఆమోదం పొందకుండా చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఎన్ని రకాల కుట్రలు చేశారో వివరిస్తూ తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు తెలంగాణ వైపు మాట్లాడుతాడా? ఆంధ్ర వైపు మాట్లాడతాడా? అని ప్రశ్నించారు. మనకు తెలివి, బలం, ఐక్యత ఉందని, మనల్ని మనమే పాలించుకుందామని చెప్తూ తెలంగాణ ప్రాంతానికి ఎన్నో పథకాలు అమలు చేస్తానని ప్రకటించారు. విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, గృహనిర్మాణం తదితర అంశాలకు సంబంధించి భారీ పథకాలు ప్రకటించారు. ఎమ్మెల్యే పీ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారని ప్రశంసించారు. టీఆర్ఎస్ పార్టీని రంగారెడ్డి జిల్లాలో బలమైన పార్టీగా మారుస్తామని అన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని, కొన్ని కారణాలవల్ల పార్టీని వీడినా మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలోకి రావడం సొంత ఇంటికి చేరుకున్నట్లుగా ఉందని ఎమ్మెల్యే కేఎస్ రత్నం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *