mt_logo

మానవనిర్మిత మహాద్భుతం

జిల్లాకు కీర్తి శిఖరమై… రాష్ట్ర ప్రతిష్టకు మణిహారమై… దేశానికి సౌభాగ్యమైన నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చరిత్రపుటల్లో నిలుస్తోంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రథమ చిహ్నమైన ఈ ప్రాజెక్టును పెద్దవూర మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో నందికొండ గ్రామం వద్ద కృష్ణానదిపై నిర్మించారు. ఈ ప్రాంతానికి గతించిన యుగాల్లో ఘనమైన చరిత్ర, ఎనలేని ప్రాశస్త్యం ఉంది. మహాయాన మాధ్యమిక ప్రముఖుడు ఆచార్య నాగార్జునుడు ఇక్కడ బౌద్ధారామం నెలకొల్పి దేశ విదేశాల విద్యార్థులకు విద్యను పంచిన కారణంగా ఇది అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది. అందువల్లనే ఈ ప్రాజెక్టుకు ఆచార్య నాగార్జునుడి పేరిట నాగార్జున సాగర్‌గా నామకరణం చేశారు. గతంలో ఇక్కడ విజయపతాకాన్ని ఎగుర వేసిన ఇక్షాకు వంశస్తుల రాజధాని విజయపురి నేటికీ అదే పేరుతో వాడుకలో ఉంది.

శ్రమజీవుల పనితీరుకు నిదర్శనం నాగార్జునసాగర్ డ్యాం…

శంకుస్థాపన అనంతరం 1956 ఫిబ్రవరి నెలలో నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణానికి ప్రాథమిక చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆనకట్ట నిర్మాణానికిగాను ఎగువ కృష్ణా నీటిని మళ్లించేందుకు కాపర్ డ్యామ్ నిర్మాణం ప్రారంభించారు. 1957 జూలై 12న అప్పటి కేంద్ర నీటి పారుదల, విద్యుత్ శాఖ మంత్రి ఎస్.కే పాటిల్ ప్రారంభోత్సవం గావించారు. ఈ కాపర్ డ్యామ్ నిర్మాణంతో పాటు నీటిని మళ్లించేందుకు పెద్ద కొండను తొలిచి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. 27 అడుగుల వ్యాసంతో 290 అడుగుల నిడివిగల ఈ సొరంగం చూపరులకు ఆశ్చర్యం గొల్పుతుంది. డ్యామ్ నిర్మాణ సమయంలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ర్టాల నుంచి కూడా ఎందరో కార్మికులు కదలి రాగ ఇదొక శ్రామిక నగరంగా మారింది. స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా సుమారుగా 50,000మందికి పైగా రేయింబవళ్లు మూడు షిప్టుల వారీగా స్వేదం చిందించారు. ఈ ప్రశాంత విప్లవంలో వేలాది మంది కార్మికులు అసువులు బాయడం జరిగింది.

ఆధునిక దేవాలయానికి పునాది

నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపన 1955 డిసెంబర్ 10న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతులమీదుగా జరిగింది. నాడు ప్రధాని మాట్లాడుతూ ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టును స్వతంత్ర భారతావనిలో మనం నిర్మించుకుంటున్న ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.

భారతీయ ఇంజినీర్ల అద్భుత ప్రతిభ…

విదేశీ ఇంజినీర్ల సాంకేతిక పరిజ్ఞానంతో నిమిత్తం లేకుండా భారతీయ ఇంజినీర్లు తమ ప్రతిభా పాటవాలతో మొట్టమొదటిసారిగా నాగార్జునసాగర్ ఆనకట్టను అద్భుతంగా కట్టి ఇక్కడి మట్టి గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటారు. యావత్ ప్రపంచ సాంకేతికలోకమే అబ్బుర పడేలా అత్యధిక ఎత్తు, నిడివిగల మహత్తరమైన ఈ డ్యాంను పూర్తిస్థాయిలో రాతితోనే నిర్మించారు. పుష్కర కాలం పాటు కార్మికులు ఇంజినీర్లు సల్పిన కృషి, పట్టుదల ఫలితంగా 1969 నాటికి డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. ప్రధాన డ్యాంకు రెండు పక్కలా ఎర్త్‌డ్యాంలు నిర్మించారు. ప్రధాన డ్యాం భాగంలో 1540 అడుగులు నిడివి గల జలప్రవాహిత (స్పిల్‌వే) భాగం ఉంది. ఈ స్పిల్‌వే పైన 26 రేడియల్ క్రస్టగేట్లును 13.71/13.41 మీటర్ల సమానమైన కొలతలతో ఏర్పాటు చేశారు. వీటిని అమర్చిన తదుపరి జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయిలో 590 అడుగులుగా అయ్యింది. 110 చదరపు మైళ్ల విస్తీర్ణంలో జలాశయం ఏర్పిడింది. 1973-1974 సంవత్సరాల్లో క్రస్ట్ గేట్ల నిర్మాణం పూర్తయ్యింది. దివంగత దాసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పల్పుల శివయ్య తదితరులు నందికొండ డ్యాం కావాలని 1948 సంవత్సరంలో చేసిన అందోళనకు ఫలితంగా దక్కినందుకు పలనాటి సీమ అనందించగా, తెలంగాణ ప్రాంతం పులకించి పోయింది. డ్యాం నిర్మాణానికి నాగార్జునసాగర్ అనువైన ప్రదేశం కావడంతో నిర్మాణ పనులు సాఫీగా సాగాయి. ఇక్కడ రెండు కొండల నడుమ కృష్ణానది వెడల్పు తక్కువగా ఉండడం, నేల సైతం దృఢంగా ఉండడానికి తోడు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రాయి, ఇసుక సమీపంలోనే లభించడంతో నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యింది.

జలాశయ సామర్థ్యం

ప్రపంచంలో మానవ నిర్మిత రిజర్వాయర్లలో మూడో స్థానాన్ని ఆక్రమించిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ 110 చదరపు మైళ్ల విస్తీర్ణం, 408 (టీఎంసీ) శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం కల్గి ఉంది. ఈ రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా 36 వేల క్యూసెక్కుల నీరు సరఫరా జరిగేందుకు చర్యలు చేపట్టారు.

డ్యాం నిర్మాణానికి శ్రీకారం

కృష్ణానదీ జలాలను ఉపయోగించుకుని పంటలు పండించాలనే ఆలోచన ఈ శతాబ్దపు తొలినాళ్లలోనే ప్రారంభమైంది కానీ కొన్ని అవాంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 1930లో నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు సేద్యపునీటి సౌకర్యం కల్పంచాలని భావించిన నాటి నైజాంనవాబు మద్రాసు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని అనుమతి కోరగా అది కార్యరూపంలోకి రాలేదు. ఆ తర్వాత 1948వ సంవత్సరంలో నిజాం పాలన అంతమై భారత రాజ్యాంగంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రం అవతరించిన అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆలోచన మొదలైంది. సముద్రమట్టానికి 546అడుగుల ఎత్తులో ఆనకట్ట నిర్మించి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 8లక్షల ఎకరాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోను 2లక్షల 37వేల ఎకరాలు సేద్యం చేయవచ్చని భావించారు ఆనకట్ట నిర్మాణంతో పాటు లక్షా 63వేల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల విద్యుత్ కేంద్రం కూడా ఈ పథకం అంతర్భాగం. నాగార్జునసాగర్ నిర్మాణం జరిగిన స్థలాన్ని మొదట సర్వే చేసి పథకాన్ని రూపొందించింది చీఫ్ ఇంజనీర్ అలీనవాబ్ జంగ్.

కార్యరూపం…

మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కృష్ణా, పెన్నా పథకంపై అంతిమ నిర్ణయానికి రాకముందే కృష్ణాజలాల సద్వినియోగ వివరాలను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని అదేశించింది. రెండు రాష్ట్రాల మధ్య డ్యాం నిర్మాణం జరగాల్సి ఉన్నందున ప్రణాళిక సంఘం కమిటీ సమన్వయ పథకాన్ని రూపొందించింది. నిజాం కాలంలోను, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సర్వే చేసిన నాగార్జునసాగర్ ప్రదేశాన్ని డ్యాం నిర్మాణానికి అనువైనదిగా కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ తన పథకంలో 546 అడుగుల ఎత్తున అనకట్ట నిర్మాణం ఎడమ, కుడి కాల్వల నిర్మంచేలా సూచనలు చేసింది. ప్రణాళిక సంఘం అదేశాల మేరకు ఆనాటి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు తగు నివేదికలు రూపొందించడం, అవి కార్యరూపం దాల్చడం కూడా వెంట వెంటనే జరిగాయి.

ప్రధాన విద్యుత్ కేంద్రం

సాగర్ డ్యాం నిర్మాణం పూర్తయిన అనంతరం నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. డ్యాం నిర్మాణ సమయంలోనే జల విద్యుత్ కేంద్రానికి కూడా పక్కా పథకం రుపొందించారు. ఇందుకు అవసరమైన 8పెన్‌స్టాక్ పైపులు అమర్చడానికి వీలుగా డ్యాంకు బల్క్‌హెడ్ గేట్లను నిర్మించారు. 1985 నాటికి 8ప్రధాన యూనిట్ల నిర్మాణం పని పూర్తయింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నిర్మించిన యూనిట్ 1978 జూలై 10వ తేదీన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఇది 110మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.

కుడి కాల్వ(జవహర్ కెనాల్)…

నాగార్జునసాగర్ కుడికాల్వ తవ్వకాన్ని 1956అక్టోబర్ 10వ తేదీన అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. దీని నిర్మాణానికి 1250మంది కార్యాలయ సిబ్బంది. నాలుగువేల మంది సాంకేతిక సిబ్బంది, 40,000వేల మంది సాధారణ కార్మికులు దాదాపు 12సంవత్సరాల పాటు పని చేశారు. సాగర్ రిజర్వాయర్ నుంచి ఈ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద 9గేట్లు అమర్చారు. ఈ హెడ్ రెగ్యులేటర్ వద్ద జల విద్యుత్ కేంద్రం కూడా నిర్మించారు. ఈ కాల్వ దక్షిణ విజయపురి వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రవహిస్తుంది. దీని పొడవు పూర్తి నిర్మాణ దశలో 245మైళ్లు. ఇది సోమశిల వద్ద పెన్నానదిలో కలుస్తుంది. ఈ కాల్వ 21,000వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో 20లక్షల 62వేల ఎకరాల భూమికి సేద్యపు నీరు సరఫరా చేయగల శక్తి కలిగి ఉందని భావించారు. అయితే ప్రస్తుతం దాదాపుగా 8లక్షల పైచిలుకు ఎకరాలకు మాత్రమే నీటి సదుపాయం ఉన్నట్లు తెలుస్తున్నది. కుడి కాల్వ చంద్రవంక, నాగులేరు, గుండ్లకమ్మ, బుగ్గేరు, మొదలైన 178పెద్ద, చిన్న వాగులను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంది. 1967అగస్టు 4వ తేదీన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఈ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఆంధ్ర జాతికి అంకితం చేశారు. దీనికి ప్రథమ ప్రధాని జ్ఞాపకార్థం జవహర్ కెనాల్ అని నామకరణం చేశారు. ఒకప్పుడు శ్రీనాథుడు దాహం తీరక ఆర్తితో బాధపడిన పల్నాడు ప్రాంతం నేడు కృష్ణానది ఉరుకుల పరుగులతో సేద్యపు భూములతో కళకళలాడుతోంది.

ఎడమ కాల్వ(లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్)…

సాగర్ ఎడమ కాల్వకు జై జవాన్ – జై కిసాన్ అని పిలుపునిచ్చిన మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహుదూర్‌శాస్త్రి జ్ఞాపకార్థం… లాల్ బహుదూర్ కెనాల్ అని నామకరణం చేశారు. ఈ కాల్వ ప్రారంభమైన కొంత దూరం తరువాత పొట్టిచెల్మ నుంచి చలకుర్తి గ్రామం వరకు కొండల అడుగు భాగంలో తొలచిన సొరంగ మార్గం ద్వారా ప్రవహిస్తుంది. సొరంగ మార్గం 32 అడుగుల వ్యాసం, 8465 అడుగుల నిడివి కలిగి గుర్రపునాడె అకారంలో మలచ బడి ఉంది కాల్వ ప్రవహించే సొరంగ మార్గం యావత్ భారతదేశంలోనే పెద్దదిగా తెలుస్తోంది. ఈ సొరంగం నిర్మాణానికి 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్ భీమసేన సచార్ శంకుస్థాపన చేశారు. కాల్వనిడివి తుది దశలో 218మైళ్లు. ఇది హాలియా, మూసీ, గడవరం, వైరా, కట్టలేరు, తమ్మిలేరు మొదలైన 138పెద్దా, చిన్న వాగులను దాటుకుంటూ నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలోని ప్రవహించి చివరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాల్వలో కలుస్తుంది. దీని నిర్మాణానికి 900 మంది కార్యాలయ సిబ్బంది, 2,500 మంది సాంకేతిక సిబ్బంది, 30వేల మంది కార్మికులు దాదాపు పదేళ్లపాటు విశేషంగా కృషి చేశారు. దీనిని కూడా 1967 అగస్టు 4వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నీటిని విడుదల చేసి ప్రారంభించారు. సుమారు 22 అడుగుల లోతు కల్గిన ఈ కాల్వ ద్వారా 15వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది దీని ద్వారా ప్రస్తుతం సుమారు 8లక్షల వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీని హెడ్ రెగ్యులేటర్ వద్ద కూడా జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *