ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సిద్దిపేటలో ఈరోజు వాటర్ గ్రిడ్ పథకంపై ఇంజినీర్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సిద్ధిపేట వాటర్ గ్రిడ్ పథకాన్ని 90 శాతం తానే డిజైన్ చేశానని, 10 శాతం ఇంజినీర్ల సహకారం తీసుకున్నామని చెప్పారు. సిద్ధిపేట వాటర్ స్కీం నిరాటంకంగా కొనసాగుతోందని, దీన్ని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ వాటర్ గ్రిడ్ అమలవుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వాటర్ గ్రిడ్ ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటుందని, మిడ్ మానేరు ద్వారా కరీంనగర్ జిల్లా మొత్తానికి తాగునీరు సరఫరా అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
37 సార్లు ఎల్ఎండీని సందర్శించామని, చివరి నీటిబొట్టును కూడా తీసుకునేలా ప్లాన్ చేశామని కేసీఆర్ చెప్పారు. ఒకప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంలో భయంకరమైన నీటి సమస్య ఉండేదని, ఎండాకాలం వచ్చిందంటే నీటికోసం యుద్ధాలు జరిగేవని, రాత్రింబవళ్ళు కష్టపడి తాగునీటిని అందించామని సీఎం వివరించారు. త్వరలో తాను మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శిస్తానని, మహబూబ్ నగర్ కు శ్రీశైలం నుండి నీటి సరఫరా జరుగుతుందని అన్నారు.
ప్రతి ఇంటికీ నల్లా నీరు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని, యావత్ దేశం తెలంగాణ వైపు తిరిగి చూసేలా పేరు తెచ్చుకుంటామని, కష్టపడి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు. సిద్దిపేటలో ఎందరో ఆణిముత్యాలు ఉన్నాయని, అందులో హరీశ్ రావు ఒక ఆణిముత్యమని ప్రశంసించారు. సిద్ధిపేటకు సాగు నీరందించే బాధ్యత హరీష్ దేనని,ఆయన మంచి వ్యూహకర్త అని, ఎలాగైనా నిధులు తెస్తాడని సీఎం చెప్పారు.