mt_logo

కుట్ర ధోరణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజా మాటలను బట్టి ఆయనలో ఆధిపత్యధోరణి, తెలంగాణ వ్యతిరేకత ఇంకా తగ్గలేదని తెలుస్తున్నది. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నందున తన మాటలు ఆ పదవికి గౌరవం తేవాలనే సోయి కూడా ఆయనలో కనిపించడం లేదు. 2019లో తెలంగాణలో తామే అధికారం చేపడతామని, ఇంకా ముందే చేపట్టవచ్చునని అనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమం స్వీయ రాజకీయ అస్థిత్వం కోసం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో స్వీయ రాజకీయ అధికారం సిద్ధించింది. పరాయి రాష్ట్రం పెద్దమనుషులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏలడం కుదరదని అది 2019లో కాదు, 2090లో కూడా సాధ్యంకాదని చంద్రబాబు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. చంద్రబాబు ఆయన ఆర్థిక విధానాలు తెలంగాణను ధ్వంసం చేయడమే కాకుండా, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా పార్టీతో తీర్మానం చేయించి, ఆ తరువాత మాట మార్చిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. ఇంకా తెలంగాణలో పెద్దరికం చేస్తామంటే ప్రజలు సహించరు. తెలంగాణలో 2019 లోనైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటుండవచ్చు.

కానీ ఆలోపే అధికారానికి వస్తామని చెప్పడం ఆయన కుట్రబాజీతనాన్ని వెల్లడిస్తున్నది. టీడీపీకి తెలంగాణలో తిప్పితిప్పి కొడితే వచ్చిన సీట్లు పదిహేను. వీటితో అధికారానికి వస్తామనడం తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో కూలదోస్తానని చెప్పడమే. అంగబలం, అర్ధబలం, కుట్రలు కుతంత్రాలతో పార్టీలో పట్టుసాధించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుకు ఉండవచ్చు. సీమాంధ్ర పెత్తందారులు ధనమదంతో ప్రభుత్వాలను మార్చగల దిట్టలు కావచ్చు. ఇంతకాలం తెలంగాణలో ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించి దోచుకుని ఉండవచ్చు. కానీ తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ఇంకా తమ డబ్బు సంచుల రాజకీయమే చెలామణి అవుతుందని, సరిహద్దుకు ఆవలి నుంచి ఇక్కడి ప్రభుత్వాన్ని, ప్రజలను శాసించవచ్చునని భావిస్తే అందుకు ఫలితం అనుభవించవలసి వస్తుంది.

తెలంగాణ ఉద్యమం స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో స్వీయ రాజకీయ అధికారం సిద్ధించింది. పరాయి రాష్ట్రం పెద్ద మనుషులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏలడం కుదరదని అది 2019లో కాదు, 2090లో కూడా సాధ్యంకాదని చంద్రబాబు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సాగినంత కాలం ఇక్కడి ప్రజలు ఎంతో సంయమనం పాటించారు. రాష్ర్టాలుగా విడిపోయినా ప్రజలుగా కలసి ఉండాలనే గొప్ప సందేశాన్ని అందించారు. ఈ ఉద్యమం వల్లనైనా చంద్రబాబులోని సంస్కారం మెరుగు పడాల్సింది. కానీ తెలంగాణ పట్ల ఇంకా అవే మాటలు వినిపించడం అభ్యంతరకరం. తెలంగాణ ప్రజలను కాపాడే బాధ్యత కూడా తనదే అని చెప్పడం ఇక్కడి ప్రజలను అవమానపరచడమే. చంద్రబాబును అనేక ఎన్నికలలో తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించారు. తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం ప్రజలకు మొహం చూపలేక ఇంటెనుక పన్న చరిత్ర చంద్రబాబుది. ఈ పెద్ద మనిషి తన ప్రాంతం నుంచి తెచ్చుకున్న గూండాలు కర్రలూపుతూ వాహనాలలో వెంబడిస్తుంటే, తెలంగాణలో పర్యటించాడనేది మరిచిపోకూడదు. ప్రజలు లాఠీదెబ్బలకు ఓర్చి ఈయన వాహనాలకు ఎదురు వెళ్ళి నిరసన తెలిపారనేది ఇటీవలి చరిత్ర. అటువంటి బాబు తెలంగాణ ప్రజలకు భద్రత కల్పిస్తానంటున్నాడు. ఎవరి నుంచి భద్రత కల్పిస్తాడట! తాను వెంట తెచ్చుకునే గూండాల నుంచా? పంజాబ్ ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు ఇందిరాగాంధీ, శ్రీలంక పట్ల అనుసరించిన విధానాలకు రాజీవ్ గాంధీ ఫలితం అనుభవించారని, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆ ఫలితాన్ని కాంగ్రెస్ అనుభవిస్తుందని చంద్రబాబు అనడంలోని అంతరార్థం ఏమిటి? ఆయన హింసాయుత రాజకీయాలను అనుసరించదలుచుకున్నాడా? ఈ సీమాంధ్ర పెత్తందారులు అనేకసార్లు తెలంగాణ మనోభావాలను దెబ్బతీశారు.

అయినా తెలంగాణ ఉద్యమకారులు సహనం పాటించారే తప్ప ఇటువంటి హెచ్చరికలు చేయలేదు. విష బీజాలు నాటే వారు వాటి ఫలాలను కూడా అనుభవించవలసి వస్తుందని గ్రహించాలె. హైదరాబాద్‌ను తానే అభివద్ధి చేసినట్టు, తెలంగాణ ప్రాజెక్టులు కట్టినట్టు చెప్పుకోవడం ఉలాలు మాటలు. చంద్రబాబు తాతలు పుట్టకముందే హైదరాబాద్ గొప్పనగరం. తెలంగాణకు న్యాయబద్ధంగా రావలసిన నీటి వాటా ఎందుకు ఇవ్వలేదనేది చంద్రబాబు సంజాయిషీ చెప్పుకోవాలె. దమ్ముంటే చంద్రబాబు, ఆయన బంధుగణం హైదరాబాద్‌లోని తమ అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధపడాలె.

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడే సొంత రాజధాని నగరం నిర్మించుకుంటే ఇంతకాలం పరాయి పంచన బతకవలసి వచ్చేది కాదు. ఇప్పటికైనా చంద్రబాబుకు తెలివి ఉంటే సొంత రాజధానిని నిర్మించాలె. ఏ మాత్రం ఇంగితం ఉన్నా తెలంగాణ లేకపోతే బతకలేని దుస్థితి నుంచి బయటపడాలె. హైదరాబాద్‌ను పట్టుకుని యాల్లాడుతూ ఇంకా ఈ నీల్గుడెందుకు? విభజన తమకు నష్టదాయకమంటూ ఏడుపుగొట్టు మాటలెందుకు? కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీస్తనని బోయిండట. సీమాంధ్రను ఉద్ధరించలేనోడు, తెలంగాణలో పెత్తనం చెలాయిస్తనంటున్నడు! మళ్లా రెండు రాష్ర్టాలను కలుపుతానని ఆశ పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నడు. తెలంగాణ ప్రజలు ఎంతో సంస్కారవంతులు. ఇంత కాలం హైదరాబాద్‌లో ఉన్నందుకు ఆ సంస్కారంలో వందో వంతు ఒంటబట్టినా చంద్రబాబు ఇంత అన్యాయంగా మాట్లాడడు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *