mt_logo

ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

అనారోగ్య పీడితున్నే అయితేనేం యోధున్నే అన్న చెరబండరాజు బాటలో కార్టూనిస్టు శేఖర్ చివరిక్షణం వరకు పోరాడాడు. శరీరాన్ని వేధిస్తున్న క్యాన్సర్‌తో, సమాజాన్ని పీడిస్తున్న క్యాస్ట్ క్యాన్సర్‌తో ఏకకాలంలో పోరాడిన యోధుడు కంబాలపల్లి శేఖర్.

తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన బొమ్మ కావాలనుకుంటే మనకు ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ గుర్తుకొస్తాడు. అదే విధంగా ఈ కాలంలో ప్రపంచీకరణకు, వివిధ ఆధిపత్య రూపాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాలకు, తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా ఒక కార్టూన్ కావాలంటే శేఖర్ యాదికొస్తడు. శేఖర్ ట్యూన్స్ బ్లాగ్‌స్పాట్.కామ్ అన్ని పోరాటాలకు అడ్డా. అక్కడ మనకు అంకుల్ శ్యాం కుట్రలు కనిపించి కండ్లు తెరిపిస్తయి. ఆధునికత దెబ్బకు గిలగిల కొట్టుకుంటున్న చేతి వత్తులు కనిపిస్తయి. వర్తమాన ప్రపంచంలోని బాధ, జనాల కన్నీళ్లు కలగలిసిన కార్టూన్లు ఆలోచింపచేస్తయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు గిదీతెలంగాణ అంటూ శేఖర్ గీసిన కార్టూన్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద హోర్డింగ్‌గా మారింది. ఒక ఆధిపత్య కులం మీడియాను, రాజకీయాలను, సినిమా తదితర రంగాలను శాసిస్తున్న వాస్తవాన్ని ఆయన ఒకే కార్టూన్ ద్వారా చూపించాడు. అందులో ఒకే కులానికి చెందిన ప్రముఖులను చూపించి ఇదే సమైక్యాంధ్ర అని వ్యంగ్యంగా చెప్పిండు. ఇది తెలంగాణ వారినే కాదు, సీమాంధ్రకు చెందిన వారిని కూడా కదిలించింది. తెలంగాణలో ఈ కాలంలో పుట్టిన బిడ్డ ఏ విధంగా ఆలోచిస్తాడో దానికి ప్రతీక శేఖర్. ఉద్యమాలకు ఊపిరి ఊదాలె. కులం పునాదులను పెకిలించాలె. వర్గ పోరాటానికి ఆయుధాలు అందించాలె. అస్థిత్వ పోరాటంలో భాగం కావాలె అనే తపన శేఖర్ కార్టూన్లలో కనిపిస్తది. నూనూగు మీసాల నాడు ఏ భావోద్వేగాలతో, ఏ ప్రజా పక్షపాత భావజాలంతో కుంచె చేత పట్టిండో తుది శ్వాసదాకా అంతే భావోద్వేగం ఆయనలో నిలిచిఉంది.

ఉద్యమాల ఖిల్లా సూర్యాపేటలో పుట్టిన కంబాలపల్లి శేఖర్ విద్యాభ్యాసం నల్లగొండలో సాగింది. ప్రజాశక్తిలో పొలిటికల్ కార్టూనిస్టుగా కుంచెతో మొదలైన పోరాటం ఇరవై ఐదేళ్లుగా సాగింది. ఆంధ్రజ్యోతిలో చేరడానికి ముందు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో అడుగుపెట్టిన కాలం నుంచి నేటివరకు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ రెండున్నర దశాబ్దాల్లో పత్రికారంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కార్టూన్‌కు ఉండే స్పేస్ మాత్రం అలాగే ఉన్నది. శేఖర్ నిత్య విద్యార్థిగా సమాకాలీన అంశాలను అధ్యయనం చేస్తూ వాటిని కార్టూన్లలోకి అనువదిస్తూ వచ్చాడు. పత్రికారంగంలో ఉన్న పొలిటికల్ కార్టూనిస్టులలో శేఖర్ తనదైన మార్క్‌ను నిలబెట్టుకున్నాడు. శేఖర్ గీతల్లో వంపుసొంపులే కాదు అందరిని ఆలోచింపచేసే అంశాలు తీవ్రంగా ఉంటాయి.

కార్టూనిస్టులకు ఆయా పత్రికల్లో పనిచేసే సందర్భంలో పరిమితులున్నా ఆ స్పేస్‌లోనే తనదైన వాణిని వినిపించాడు. ఇప్పుడున్న వర్తమాన రాజకీయాలపై ఎవరికీ ఏకాభిప్రాయం ఉండదు. అలాంటప్పుడు ఏదైనా ఒక అంశంపై అందరిని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి సంక్లిష్ట సమయంలోనే శేఖర్ తెలంగాణ జాతి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను శేఖర్ గిదీ తెలంగాణ రూపంలో చూపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలకు పాల్పడుతున్న వారిని చూసి చలించిపోయాడు. ప్రపంచీకరణ తెచ్చి పెట్టిన విధ్వంసం, ఉత్పత్తి కులాలు ధ్వంసమవుతున్న తీరును చూసి కలవరపడి కసితో కుంచె ఎక్కు పెట్టాడు. పండించిన పంటకు గిట్టు బాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల ఆవేదనను అర్థవంతంగా చూపెట్టాడు.

వేలాది కార్టూన్లు వేసినా కమ్యూనిస్టుగా తాను గోడలపై రాసిన రాతలే తనకు స్ఫూర్తి అనేవాడు శేఖర్. ఆ స్పృహే తెలంగాణ అస్థిత్వ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించేలా చేశాయి. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు ప్రజాపోరాటాలలో వీలైనంత మేర ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఉద్యమాలతో మమేకం అయ్యాడు. కార్టూనిస్టుగా వాటికి సంఘీభావం ప్రకటించాడు. కార్టూనిస్టుగా తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకోవడమే కాకుండా సందర్భం వచ్చినప్పుడు తనవంతుగా పోరాటంలో భాగస్వామి అయ్యాడు. పోరాటాల గడ్డ నల్లగొండ నుంచి వచ్చిన శేఖర్ అస్థిత్వ పోరాటాల్లో, సామాజిక ఉద్యమాల్లో కార్టూనిస్టుగా అందరికంటే ముందు ఉన్నారు.

కార్టూనిస్టుగా శేఖర్ గీసిన వేలాది కార్టూన్లు దేశంలో, విదేశాల్లో అనేక భాషల్లో వచ్చాయి. ప్రాంతీయ పత్రికలో పనిచేసే కార్టూనిస్టుకు ఇంతగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం అసాధారణం. అమెరికాలో జరిగిన కార్టూన్ల ప్రదర్శనలో పాల్గొన్న శేఖర్ అక్కడ కలర్స్ ఆఫ్ ఇండియా కార్టూన్ల పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో ఒక్కో అంశంపై ఆయన గీసిన కార్టూన్లు అక్కడికి వచ్చిన దేశ, విదేశాల కార్టూనిస్టులను అబ్బురపరిచాయి. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు, గ్రీన్‌హంట్ పేరిట జరుగుతున్న ఆదివాసీ జీవితాల విధ్వంసం ఆ కార్టూన్లలో ప్రతిబింబించింది. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం అభివద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయో ది లాస్ట్ సప్పర్ అనే బొమ్మలో శేఖర్ అద్భుతంగా చిత్రించారు.

డాలర్ ధాటికి రూపాయి ఎలా కొట్టుకుంటున్నదో చూపెట్టారు. రూపాయికి రూపమిచ్చి కేంద్రం దానికి ఆమోద ముద్రవేసినపుడు అందులో భారతదేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపారు. ఇది ఆర్‌బీఐ వారి ప్రశంసంలు కూడా అందుకున్నది. దశాబ్దాలుగా ఆచరణలో అమలుకు నోచుకోని మహిళా బిల్లుపై తన మార్క్ వ్యంగ్యాన్ని శేఖర్ కార్టూన్ రూపంలో ఆవిష్కరించారు. అరబ్ దేశాల్లో అక్కడి పాలకులపై ప్రజాగ్రహం, శ్రీలంకలో మారణహోమం, మైకెల్ జాక్సన్ చనిపోయిన రోజు వేసిన కార్టూన్, భారత దేశ జనాభా విస్ఫోటనం మొదలైన అంశాలపై శేఖర్ కార్టూన్లు మళ్లా మళ్ళా యాదికొచ్చి ఆలోచింపచేస్తాయి. ఒక కార్టూనే కాదు వ్యక్తుల ఇలస్ట్రేషన్‌లలో వారి లోతైన జీవన మూలాలను శేఖర్ చిత్రించారు. ఆయనలో మంచి రచయిత దాగి ఉన్నాడని అప్పుడప్పుడు రాసిన వ్యాసాలు చదివితే తెలుస్తుంది.

వృత్తిలో ఎంత తీరిక లేకుండా ఉన్నా జీవిత సహచరి చంద్రకళకు చదువు నేర్పించాడు. తన చేత కలుపు తీసిన…. కంప్యూటర్ చేసిన…. పుస్తకం రాయించాడు. అందుకే ఆమె ..కొమ్మ చెక్కితె బొమ్మరో-కొలిసి మొక్కితె అమ్మరో అన్నట్టు నన్ను తయారు చేశాడని శేఖర్ గురించి పుస్తకంలో చెప్పింది. పాతికేళ్ల శేఖర్ కార్టూన్ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి. పాత్రికేయ వృత్తిలో ఉండే కులం కుళ్ళు వల్ల అనేక ఒత్తిళ్ళను ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు మానసిక వ్యధకు గురయ్యాడు. అయినా అధైర్యపడకుండా వాటిని అధిగమిస్తూ కార్టూనిస్టుగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ మధ్యనే శేఖర్ తన ఇరవై ఐదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. శేఖర్ రజతోత్సవాన్ని సహచర కార్టూనిస్టులు ఘనంగా జరిపారు. శేఖర్ క్యాన్సర్ వ్యాధిపై పోరాడుతూనే సమాజంలో నెలకొన్న కులవివక్షను ఎండగడుతూ క్యాస్ట్ క్యాన్సర్ పేరుతో కార్టూన్ల పుస్తకాన్ని తెచ్చాడు. ఆరోగ్యం సహకరించక పోయినా నా చేయి కదులుతున్నది చాలు అని సంబురపడుతూ చివరి రోజు వరకు కార్టూన్లు వేశాడు. మరునాడు ఆయన కార్టూన్ చూసి పాఠకులు నవ్వుకునే వేళ ఆయన కన్నుమూశాడు.
– ఆసరి రాజు

పోరాట ఖిల్లా సూర్యాపేట మట్టినుంచి ఎదిగి వచ్చిన కుంచె సైనికుడు కార్టూనిస్టు శేఖర్. ఆయన తన 25 ఏళ్ల కార్టూనిస్టు వృత్తి జీవితంలో రాజీలేని పోరాటం చేసి కార్టూన్ కళకే కొత్త కళ అద్దాడు. వాటికి జీవం పోసి రోగగ్రస్త వ్యవస్థపై పోరుకు పంపాడు. తన పోరాటంలో శేఖర్ ఎన్నడూ అలసిపోలేదు. వెనకడుగు వేయలేదు. రెండేళ్ల క్రిందట బయట పడ్డ క్యాన్సర్‌తో నిరంతరం పోరాడుతూనే దేశాన్ని పట్టిపీడిస్తున్న కులం క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించాడు. తనదైన శైలిలో కార్టూన్‌లో సమరం సాగించాడు. ఈ నేపథ్యంలో తాను క్యాన్సర్ పీడితుడైనా ఎవరి సానుభూతి కోరుకోలేదు. కార్టూన్‌లపై ప్రేమతో చేసే కార్యక్రమాలనే కోరుకున్నాడు. ఆయన గీసిన కార్టూన్‌లతో ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన తర్వాత క్యాన్సర్‌తో పోరాడడానికి వెయ్యేనుగుల బలాన్నిచ్చిందని సంతోషపడ్డాడు. చావుకు నేను సిద్ధం అంటూ హిందూ పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి కుంచె అంచులను మీసాల్లా మెలేసిన శేఖర్‌కు సానుభూతి, సంతాపాలు గిట్టవు. తన కార్టూన్‌లు నవ్వించడం కంటే, ఆలోచింపచేస్తే చాలంటాడు శేఖర్. నిన్న ఇంటికి వెళ్లి చూస్తే శేఖర్ లేడు. కుర్చీలో ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది. దాంట్లో శేఖర్ కార్టూన్ వుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో శేఖర్ కార్టూన్‌ని స్మరించుకుందాం. ఆయన కార్టూన్‌ను సన్మానించుకుందాం.

-మత్యుంజయ్, కార్టూనిస్ట్
(నేడు తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం)

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *