mt_logo

కార్టూనిస్ట్ శేఖర్ కుంచెకు ఇక సెలవు!

పాతికేళ్ళుగా కార్టూన్లు వేస్తున్న కుంచె ఆగిపోయింది. వివిధ పత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేసిన కంబాలపల్లి చంద్రశేఖర్ సోమవారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకపాత్ర పోషించిన ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం కాగా, సన్మానం పొందాల్సిన ఆయన ఒక్కరోజు ముందే చనిపోవడం అందరికీ విషాదం కలిగించింది. బంధువులు, అభిమానులు, స్నేహితుల సందర్శనార్ధం శేఖర్ భౌతికకాయాన్ని బోడుప్పల్ లోని ఆయన స్వగృహంలో ఉంచి సాయంత్రం అంబర్ పేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

శేఖర్ మృతికి పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. శేఖర్ కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పత్రికారంగానికి శేఖర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. శేఖర్ మృతిపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంతాపం ప్రకటించింది. శేఖర్ తెలంగాణ మలిఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ తన కార్టూన్లను ఫ్లెక్సీల్లో ముద్రించి ఉద్యమంలో ముందుకు సాగారు.

శేఖర్ మొదట మద్రాసు నుండి వెలువడే చిన్న పిల్లల మాసపత్రిక జాబిల్లి పత్రికకు, విజయ పత్రికకు తన కార్టూన్లను పంపించేవారు. దళిత, విప్లవ సంఘాల కోసం ఆయన ఎక్కువగా పనిచేసేవారు. ఆంధ్రప్రభ, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రజ్యోతి లలో కార్టూనిస్ట్ గా పనిచేశారు. శేఖర్ కుంచె నుండి జాలువారిన కలర్స్ ఆఫ్ ఇండియా కార్టూన్, పారాహుషార్, బ్యాంకు బాబు, గిదీ తెలంగాణ, కాస్ట్ క్యాన్సర్ తదితర కార్టూన్లు పుస్తకాల రూపంలో వచ్చాయి.

నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ సీఈవో కట్టా శేఖర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కే శ్రీనివాస్, దేవులపల్లి అమర్, ప్రొఫెసర్. కోదండరాం, విరసం నేత వరవరరావు, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, విమలక్క, న్యూ డెమోక్రసీ నాయకుడు అమర్, హెచ్ఎంటీవీ ఛీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి, తెలకపల్లి రవి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శేఖర్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *