mt_logo

సుధీర్ కుమార్ వరంగల్ ఎంపీగా గెలిస్తే ఆ పదవికే వన్నె తెస్తారు: కేటీఆర్

వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఒకవైపు.. గత రెండు దశాబ్దాలుగా.. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఒక క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడు మరోవైపు అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుధీర్ కుమార్ ఒక వైపు.. ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన కాంగ్రెస్, బీజేపీ మోసగాళ్ళు మరోవైపు. కానీ మన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నేత అని కొనియాడారు.

నిస్వార్థ, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు సుధీర్ కుమార్.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడు.. 2001 నుండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సుధీర్ కుమార్.. ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని కూడా గడిపారు.. మారేపల్లి సుధీర్ కుమార్ గారు తన ఉపన్యాసాలతో వందలాది మందిని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా చేశారు అని తెలిపారు.

సుధీర్ కుమార్ గారు విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనేవారు.. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుధీర్ కుమార్.. ఎంపీపీగా.. కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పని చేశారు.. ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

సుమారు 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సుధీర్ కుమార్.. విశేష రాజకీయ పరిజ్ఞానంతో పాటుగా ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి పట్టు కలిగిన నాయకుడు.. తన నర్సింగ్ హోమ్ ద్వారా అనేక మంది పేదలకు వైద్య సేవలు కూడా అందించారు అని పేర్కొన్నారు.

తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవ చేసిన నాయకుడు సుధీర్ కుమార్ గారు.. విద్యావేత్త డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ వరంగల్ ఎంపీగా గెలిస్తే ఆ పదవికే వన్నె తెస్తారు.. వరంగల్ పార్లమెంట్ ప్రజల సమస్యలపై గళమెత్తుతారు.. హక్కుల కోసం గట్టిగా పోరాడుతారు అని స్పష్టం చేశారు

సుధీర్ కుమార్ గెలుపు.. వరంగల్ పార్లమెంట్‌కు ఒక మలుపు అవుతుంది అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.