mt_logo

అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే కృష్ణారెడ్డి గెలవాలి: నల్గొండలో హరీష్ రావు

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కంచర్ల కృష్ణారెడ్డిని పార్లమెంటుకు పంపాలి అని పిలుపునిచ్చారు.

వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు. రేవంత్ సర్కారు ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా వచ్చిందా.. కోమటిరెడ్డి ఫ్యామిలీకి రెండు, జానారెడ్డికి ఫ్యామిలీకి రెండు ఉద్యోగాలు వచ్చాయి.. అసలైన మార్పంటే ఏంటో చూపాలి.. కేసీఆర్‌కు అండగా నిలబడాలి అని కోరారు.

మేం తెలంగాణ కోసం నల్గొండలో నిరాహార దీక్ష చేశాం.. రేవంత్ రెడ్డి ఒక్కసారన్న జై తెలంగాణ అన్నాడా?  అమరవీరుల స్తూపం వద్ద ఒక పువ్వు పెట్టని రేవంత్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు.. గ్యారంటీలు అమలు చేయడం చేతకాక తిట్లు, దేవుడిపై ఒట్లు అని దుయ్యబట్టారు.

హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది.. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఒకర్నొకరు తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు.. కాంగ్రెస్ ఓట్లు అడిగేముందు ఎన్నికల హమీల గురించి మాట్లాడాలి.. రైతుబంధు రాలేదని ఓ రైతు వ్యవసాయ మంత్రి తుమ్మలను అడిగితే నాకే పడలేదు అని ఆయన అంటున్నడు.. కేసీఆర్ ఎన్ని కష్టాలున్నా రైతుబంధు ఆపలేదు.. కేసీఆర్ విపక్ష నాయకుడిగా హామీల అమలుపై ప్రశ్నిస్తే నీ చెడ్డి ఊడదీస్తా, పేగులు మెడలో వేసుకుంటా అంటున్నడు కేసీఆర్.. సీఎం మాట్లాడే మాటలేనా ఇవి? అని హరీష్ ధ్వజమెత్తారు.

తెలంగాణను గుజరాత్‌లా మార్చాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి కేబినెట్లో ఒక్క ముస్లిం లేడు. కేసీఆర్ కేబినెట్లో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను మహమూద్ అలీకి ఇచ్చారు.. కేసీఆర్ అసలైన సెక్యూలరిస్టు.. రేవంత్ వచ్చాక రంజాన్ తోఫా బంద్ అయ్యింది.. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయిందని అబద్ధాలు ప్రచారం చేశారు.. అదే నిజమైతే కేసీఆర్ బిడ్డ ఎందుకు జైలుకెళ్తుంది.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. పదేళ్ల బీజేపీ పాలనతో ప్రజలు కష్టాలపాలయ్యారు అని విమర్శించారు.

కేంద్రంలో మనం చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా కారు గుర్తుకు ఓటేయాలి. నల్గొండకు మెడికల్ కాలేజీలు తెచ్చింది బీఆర్ఎస్ కాదా? నల్గొండ రూపురేఖలు మార్చింది కేసీఆర్. రేవంత్ సర్కారు వచ్చాక అన్ని పథకాలూ గోవిందా గోవింద.. ఇక కాంగ్రెస్ కూడా గోవిందా.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురుకుపెట్టాలి అని పేర్కొన్నారు.