mt_logo

కాంగ్రెస్ మంత్రులకు చట్టాలే కాదు చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది అని ఎద్దేవా చేశారు.

పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులే అని పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి అని అడిగారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి గారు ఆగమేఘాలమీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ. 1,137 కోట్ల రూపాయల అవినీతి జరిగిన, ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి అని అన్నారు.

పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్దాం. గతంలో ఉన్న ఫైల్స్‌తో పాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారంపైన వివరాలు ఉంచుదాం. ఆయన న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత.. నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ విసిరారు.

లేదంటే కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరి ఏదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళ్దాం. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలుసు. ముఖ్యమంత్రి ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువులకు అక్రమంగా లాభం చేయను అని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అవినీతికి పాల్పడ్డాడు అని ఆరోపించారు.

కేవలం రెండు కోట్ల లాభం ఉన్న  బావమరిది కంపెనీకి రూ. 1,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఈ బరితెగింపు మాటలు మానివేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యకి సూదిని సృజన్ రెడ్డి బంధువు కాదు ఆమెకు స్వయానా సోదరుడు. సొంత బావమరిదిని పట్టుకుని కేవలం అవినీతి కోసం టెండర్ల కోసం సంబంధం లేదని చెప్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పొంగులేటికి దమ్ముంటే విచారణ సంస్థల ముందుకు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు రావాలి. ఇప్పటికైనా జరిగిన తప్పును ఒప్పుకొని ముఖ్యమంత్రి జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి  లేకుంటే గతంలో సోనియా గాంధీ, అశోక్ చవాన్, యడ్యూరప్ప పదవులు పోయినట్లు మీ పదవులు కూడా పోతాయి అని జోస్యం చెప్పారు.

త్వరలో మల్లొకసారి పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టుల గురించి మాట్లాడుతాను. ముఖ్యమంత్రి బావమరిదికి టెండర్లు, మంత్రికి టెండర్లు సిగ్గు లేకుండా ఢిల్లీకి కప్పం కట్టేందుకు ఈ భారీ అవినీతికి ప్రభుత్వం తెగబడుతున్నది. ప్రజల తరపున ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం అని స్పష్టం చేశారు.

చీఫ్ జస్టిస్ కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ నేను చెప్పింది తప్పని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసమే చేస్తా. పొంగులేటి గారు గతంలో కాంట్రాక్టర్‌గా ఉండొచ్చు కానీ ఈరోజు మంత్రిగా ఉండి కాంట్రాక్టులు సంపాదించడం ముమ్మాటికి చట్ట వ్యతిరేకమే. అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీ ప్రభుత్వ అధికారులు అంతా కలిసి ముఖ్యమంత్రితో సహా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ముందుకు పోదాం అని అన్నారు.

ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యవహారాలకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి మొదలుకొని ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరుగుతున్నా ఒక్క మాట కూడా బీజేపీ మాట్లాడటం లేదు అని దుయ్యబట్టారు.

అధికారంలోకి వచ్చిన 9 నెలలోనే ముఖ్యమంత్రి సోదరుడు అనుముల జగదీశ్ రెడ్డి వెయ్యికోట్లు పెట్టే స్థాయికి.. రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి రెండు కోట్ల నుంచి వేయి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే స్థాయికి ఎట్ల పోయిండ్రు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైన మా దగ్గర సమాచారం ఉంది. ఈ ప్రభుత్వ అవినీతిని వరుసగా బయటపెడతాం. న్యాయస్థానాలను కూడా ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫార్మా సిటీ రద్దు అని ముఖ్యమంత్రి చెప్తారు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తారు. కానీ న్యాయస్థానాల్లో మాత్రం అసత్యపూరితమైన సమాచారంతో కూడిన పత్రాలను సమర్పిస్తుంది  మా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని, బయటనేమో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోలేదనేటువంటి మాట అధికారికంగా చెప్తుంది అని విమర్శించారు.