mt_logo

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు బోగస్: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. నిన్న సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు అది బోగస్.  కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది అని మండిపడ్డారు.

పండుగ వేళ ప్రభుత్వం కార్మి కుల పొట్ట కొడుతుంది.  లాభాల బోనస్ అంతా బోగస్.. ప్రతి సింగరేణి కార్మికుడికి కనీసం రూ. 1,80,000 నష్టం జరిగింది అని దుయ్యబట్టారు.

నికర లాభం రూ. 4,701 కోట్లలో..న్యాయంగా 33 శాతం వాటా రూ. 1551 కోట్ల రావాలి.. ప్రతి కార్మికుడికి రూ. 3,70,000 రావాలి. కానీ కేవలం రూ. 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచుతున్నారు. ఇస్తే మొత్తంగా లాభాలలో వాటా ఇవ్వాలి, లేకపోతే ఇచ్చేది కేవలం 16.9% మాత్రమే అని ఒప్పుకోవాలి. కానీ 33% అంటూ సింగరేణి కార్మి కుల లాభాల వాటా పైన అసత్యాలు చెప్పవద్దు అని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మొత్తం పది సంవత్సరాల్లో కార్మికులకు లాభాల వాటా రూపంలో దక్కింది కేవలం రూ. 365 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో లాభాల వాటా రూపంలో సింగరేణి కార్మికులకు అందించింది రూ. 2,780 కోట్ల రూపాయలు అని అన్నారు.

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సంస్థ లాభాలు పది, పదిహేను శాతానికి మించి ఏనాడు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా లాభాలను పెరిగేలా సంస్థ పనితీరును పెంచాము అని గుర్తు చేశారు.

ఒక్కొక్క కార్మికుడికి కార్మికులకు అత్యధికంగా 32% వాటా ఇచ్చాం. మేము అధికారంలో వచ్చే నాటికి 17,000 రూపాయల లాభాల వాటా ఉంటే అధికారంలోకి దిగిపోయినాటికి రూ. 1,70,000 వరకు ప్రతి కార్మికుడికి లాభాల వాటా ఇచ్చాము. సింగరేణి ప్రాంతంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానమా ఇది అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించినందుకు కార్మికులకు పోట్టగొట్టడమా చేసేది. కార్మికలోకానికి ముందే మేము హెచ్చరించాం.. ప్రస్తుతం కార్మికుల హక్కులకు పూర్తిగా భంగం కలిగించేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరిస్తుందని ముందే హెచ్చరించాం. ఆ మేరకే కాంగ్రెస్ , బీజేపీ కలిసి సింగరేణి గనుల వేలాన్ని నిర్వహించింది. బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారు వేలంలో నవ్వుతూ పాల్గొన్నారు అని పేర్కొన్నారు.

లాభాల్లో కార్మికుల వాటా తగ్గించడం అంటే, భవిష్యత్తుతో సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని, భాగస్వామ్యాన్ని తగ్గించి సింగరేణి ప్రైవేటీకరించే కుట్రగానే భావిస్తున్నాం. సింగరేణి లాభాల వాటాపైన సింగరేణి కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైన ఒత్తిడి తీసుకురావాలి. సింగరేణి ప్రాంతంలో గెలిసిన 13 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి దగ్గరికి పంపించండి. సింగరేణి ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేలు ఈ అంశంలో స్పందించి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.

సింగరేణి అధికార గుర్తింపు సంఘంతో పాటు, కూనంనేని సాంబశివరావు, బీజేపీ నేతల కూడా ఈ అంశంలో స్పందించాలి. మా సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా ఈ అంశంలో పోరాటం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.