mt_logo

తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరువలేనిది: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన ‘మే డే’ వేడుకల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరువలేనిది. సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో తమ సత్తా చాటారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు అని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్, బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, యాదాద్రి ఆలయం నిర్మాణంలో కార్మికుల శ్రమ ఉంది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలె అని వ్యాఖ్యానించారు.

ఉద్యమంలో కేసీఆర్ గారు బొంబాయి, దుబాయ్, బొగ్గు బాయి అని కార్మికులను ఉద్దేశించే అన్నారు.. కార్మికుల విషయంలో కేసీఆర్ గారి హృదయం చాలా గొప్పది. కరోనా సమయంలో కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడ్డారో మరిచిపోవద్దు. ఇదే మోడీ కాదా? కార్మికులను చావ గొట్టింది? కార్మికుల కోసం రైళ్లు పెట్టమంటే మానవత్వం లేకుండా చేసింది ఈ మోడీ కాదా? అని అడిగారు.

మళ్లీ సిగ్గు లేకుండా బీజేపోళ్లు అంటారు.. మోడీ కారణంగానే మనం బతికి ఉన్నామంటా? మోడీయే వ్యాక్సిన్ కనుగొన్నాడు అని కిషన్ రెడ్డి అంటాడు. అసలు మనల్ని చావగొట్టనందుకే ఆయనకు ఓటు వేయాలంట. మోడీ దేవుడని ఇంకొడు అంటాడు.. దేనికి దేవుడు.. కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోడీ దేవుడు అని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గితే ఎందుకు పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగినయ్..రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా ఉండేందుకు ప్రత్యేక సెస్‌లు వేసిండు. సెస్‌ల పేరు చెప్పి ప్రజల తోలు పిండి వసూలు చేసింది రూ. 30 లక్షల కోట్లు.. ఈ డబ్బులు ఏం చేసినవ్ అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు.. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావ్ అంటే చెప్పడు.. ఈ 30 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ. 14 లక్షల కోట్ల రూపాయలను అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణ మాఫీ చేసిండు. నేను చెప్పింది అబద్దమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఆని సవాల్ విసిరారు.

ఉచితాలు ఇస్తే అనుచితం అంటాడు మోడీ.. కానీ బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం రుణమాఫీ చేస్తాడు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తా అంటే వద్దు అంటాడు.. మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే లక్షా 50 వేల కోట్లు అవుతది. మోడీ కార్పొరేట్లకు చేసిన రుణమాఫీ డబ్బులతో పదేళ్లు దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు అని అన్నారు.

కరోనా సమయంలో నాకు బాగా గుర్తు. కార్మికులను కేసీఆర్ గారు.. నా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అని అన్నారు. కరోనా కష్టకాలంలో ఒక్కో కార్మికునికి 5 వందలు ఇచ్చి, భోజనం పెట్టి.. ఉచిత రైళ్లు ఏర్పాటు చేసి మంచితనాన్ని చాటుకున్నారు అని గుర్తు చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలు, పంచాయితీ సెక్రటరీలు, సెర్ఫ్ ఉద్యోగాలు, హోంగార్డులు, సింగరేణి కార్మికులు, చేనేత, గీతా కార్మికులకు ఎంతో మేలు చేసింది.. భారీగా జీతాలు పెంచింది.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేశారు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 73 శాతం జీతం పెంచారు.. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నారు.. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే వారికి బీడీ ఫించన్ ఇవ్వటం జరిగింది.. కరెంట్ మంచిగ ఇవ్వటం కారణంగా కార్మికులకు మంచి ఉపాధి దొరికింది అని పేర్కొన్నారు.

రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు మోడీ.. కానీ కాలేదు.. అదే ఆయన దోస్త్ అదానీ ప్రపంచ కుబేరుల్లో 609వ స్థానం నుంచి రెండో స్థానానికి చేరిండు. మహిళలకు, కార్మికులకు, రైతులకు ఒక్క పైసా పనిచేసినట్లు చెప్పే దమ్ము బీజేపోళ్లకు ఉందా?  ఏమైనా అంటే జై శ్రీరాం.. మనం యాదగిరి గుట్ట కట్టలేదా? రాజకీయాలను మతాన్ని వాడుకున్నామా? పదేళ్లు అధికారంలో ఉన్న చేసిన పని చెప్పుకోలేని దద్దమ్మలు బీజేపోళ్లు అని కేటీఆర్ దుయ్యబట్టారు.

చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం బీజేపీ.. రేవంత్ సర్కార్ కూడా వచ్చిన నాలుగు నెలల్లోనే చేనేత కార్మికులకు చీరల ఆర్డర్లు బంద్ పెట్టిన్రు.. వాళ్లకు గత ప్రభుత్వం చేసిన మేలు మొత్తం లేకుండా చేశారు. మళ్లీ మా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిండు అని ధ్వజమెత్తారు.

ఫ్రీ బస్సు తప్పుకాదు. కానీ దాని ఆధారంగా ఉపాధి కోల్పోయే ఆటోడ్రైవర్లకు మేలు చేయాలి కదా? ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లను రోడ్డున పడేశారు అని అన్నారు.

నేను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లనే కార్మికుల అడ్డా.. ఖచ్చితంగా కార్మికులకు నేను అండగా ఉంటాను.. పార్టీ కార్మిక విభాగాన్ని నేనే చూసుకుంటా.. భవిష్యత్‌లో చాలా ఉద్యమాలు చేద్దాం అని పిలుపునిచ్చారు.

పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని పాటించింది బీఆర్ఎస్ మాత్రమే.. మొత్తం 17 స్థానాల్లో ఐదు రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి.. అందులో రెండు ఎస్టీలు, మూడు ఎస్సీలకు ఉన్నాయి. అందులో ఒకటి బంజారా బిడ్డకు, ఒకటి ఆదివాసీ బిడ్డకు ఇచ్చాం.. మూడు ఎస్సీ స్థానాల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించాం.మొత్తం 12 స్థానాల్లో 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇచ్చాం అని కేటీఆర్ తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుసేరుకు అమ్మవద్దంటే బీఆర్ఎస్ ఉండాలె.. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణను సాధించాం. మీరు 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటది అని అన్నారు.

కార్మికులు, ఆటో డ్రైవర్లు గట్టిగా అనుకుంటే 12 సీట్లు రావటం కష్టం కాదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దంటే బీఆర్ఎస్ ఉండాలె.. గోదావరి నీళ్లను మన అవసరాలు తీరకుండా మళ్లిస్తామంటే అడ్డుకోవటానికి బీఆర్ఎస్ ఉండాలె.. రిజర్వేషన్లు, ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలె. బీజేపీ గెలిస్తే సింగరేణి, మహారత్నాలు ఇలా అన్ని అమ్మేస్తాడు అని హెచ్చరించారు.

కులాలు, మతం, జాతి పేరిట కొట్లాడుకుంటే మన దేశం ముందుకు పోము. వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే సన్నాసులకు కచ్చితంగా బుద్ధి చెప్పాలె.. అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్ రెడ్డి, పదేళ్లు మోసం చేసిన బడే భాయ్‌కి బుద్ధి చెప్పాలె అని అన్నారు.