mt_logo

2001 లోనే హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్. 2001 లోనే హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ గారు. గెలిచినా, ఓడినా కేసీఆర్‌తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అని కొనియాడారు.

సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ అన్న పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి గారు వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారంట. దేశంలో విపక్షాలు ఐతే జేబులో లేదంటే జైల్లో అన్నట్లుగా ఉంది ప్రధాని మోడీ విధానం. మైనార్టీ సోదరులు ఒక్కసారి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించాలె అని అన్నారు.

గతంలో ఒకరి పండుగలకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుని పరిస్థితి ఉండే. ఇప్పుడు దేశంలో మోడీ ఆ వాతావారణాన్ని చెడగొట్టి మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. అలాంటి బీజేపీని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదు అని పేర్కొన్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది మనమే. కాంగ్రెసోళ్లు వచ్చి బీజేపీకి మనం బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ బండి సంజయ్, ఈటల, ధర్మపురి అరవింద్, రఘనందన్ రావు, బాపురావును ఓడించిందెవరో గుర్తు తెచ్చుకోవాలె. బద్మాష్ రాజాసింగ్ కూడా ఓటమి నుంచి కాస్తలో తప్పించుకున్నాడు. కిషన్ రెడ్డిని కూడా ఓడించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి కరోనా టైమ్‌లో సికింద్రాబాద్‌లో కుర్ కురే ప్యాకెట్లు పంచిండు. కేసీఆర్ గారు కాళేశ్వరం లిప్ట్‌లను ప్రారంభిస్తే.. కిషన్ రెడ్డి గారు రైల్వే స్టేషన్‌లో లిప్ట్‌ను ఓపెన్ చేసిండు. సింటెక్స్ ట్యాంకర్, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఒక్క షెడ్‌ను మాత్రమే కట్టించిండు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి, సికింద్రాబాద్‌కు చేసివని ఈ మూడు పనులు మాత్రమే అని కేటీఆర్ విమర్శించారు

మూసీకి వరదలు వస్తే వెయ్యి కోట్లు అడిగితే రూపాయి కూడా సాయం చేయలే. బీజేపీని ఏం చేసినవ్ అని అడిగితే చెప్పేందుకు ఒక్కటి కూడా లేదు. రాముడితో మనకు పంచాయితీ లేదు.. తెలంగాణకు బుడ్డ పైసా పనిచేయని బీజేపీని మాత్రం తొక్కుదాం అని పులునిచ్చారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచిత్రమైన పరిస్థితి కనబడుతోంది. రాహుల్ బాబా ఏమో చౌకి దార్ చోర్ అంటాడు.. రేవంత్ బాబా మాత్రం మోడీ బడే భాయ్ అంటాడు. రాహుల్ బాబా అదానీ ఫ్రాడ్ అంటాడు.. రేవంత్ బాబా మాత్రం అదానీ మేరా ఫ్రెండ్ అంటాడు. రాహుల్ బాబా గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు.. రేవంత్ బాబా మాత్రం తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు. రాహుల్ బాబా లిక్కర్ స్కామ్ లేదంటాడు.. కేజ్రీవాల్ అరెస్ట్ చేయటం అన్యాయం అంటాడు.. రేవంత్ బాబా మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్ట్ అంటాడు. రేవంత్ రెడ్డి అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు.. మోడీ కోసమా? రాహుల్ గాంధీ కోసమా? అని ప్రశ్నించారు.

మైనార్టీలు కాంగ్రెస్‌కు వేసే ఒక్కో ఓటు అది బీజేపీకే వెళ్తుంది. ఆప్కి అదాలత్ అనే కార్యక్రమంలో రేవంత్ రెడ్డే స్వయంగా బీజేపీకి ఓటు వేయమని చెప్తుండు. కాంగ్రెస్‌కు దేశంలో 40 సీట్లు కూడా రావని మమతా బెనర్జీయే అంటున్నారు అని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో మహిళలు ఆలోచించాలె. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ప్రచారం కోసం వస్తే తులం బంగారం ఏదీ అని ప్రశ్నించాలి..మహిళకు రూ. 2,500, ఇంట్లో ఇద్దరు ముసలోళ్లు ఉంటే ఇద్దరికీ 4 వేలు ఇస్తామన్నారు. కాంగ్రెసోళ్లు ప్రచారానికి వచ్చినప్పుడు ఇస్తామన్న హామీలు ఏమయ్ నయ్ అని మనం అడగాలె అని పేర్కొన్నారు.

ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. వాళ్లందరికీ వద్దకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం ఎట్ల ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ల ఉందో వారికి గుర్తు చేయాలె అని కేటీఆర్ అన్నారు.

దేశంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశాడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుసంస్కారి, మూర్ఖుడు. కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టిండని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలే. రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే కేసీఆర్ కట్టించిన సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నాడు అని అడిగారు.

పేగులు కత్తిరిస్తా, జేబులో కత్తెర పెట్టుకుంటా.. మెడలో పేగులు వేసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు చెబుతున్నాడు. మాట్లాడితే లంకె బిందెలు అంటాడు. లంకె బిందెల కోసం దొంగలు కదా తిరిగేదీ? ఇచ్చిన హామీలు అమలు చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతనైతలే. అందుకే ఫోన్ ట్యాపింగ్ పేరుతో రోజుకో లీక్ ఇచ్చి టైమ్ పాస్ చేస్తుండు అని ధ్వజమెత్తారు.

మత విద్వేషాల పేరుతో బీజేపీ చేసే చిల్లర రాజకీయాలను మనం పట్టించుకోవద్దు. వచ్చే 20 రోజుల పాటు కలిసికట్టుగా అందరం పనిచేద్దాం.. కొత్త కదా కొన్ని రోజులు భయపెట్టే పని చేస్తారు. సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ అన్నను గెలిపించుకుంటే కాంగ్రెసోళ్ల నాటకాలన్నీ బంద్ అయితయ్. పార్టీ మారిన దానం నాగేందర్ సీటు పోవటం ఖాయం.. ఉప ఎన్నిక రావటం తథ్యం ఆని పేర్కొన్నారు.